Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్లకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే 'మన ఊరు- మనబడి, మన బస్తీ-మనబడి' పథకాన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు మంచి అవకాశమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. ఈ పథాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గతంలో ఆపరేషన్ బ్లాక్‌బోర్డు, సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ వంటి పథకాల ద్వారా తరగతి గదులు, టాయిలెట్లు, నీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ పథకంలో పాఠశాలల మౌలిక వసతులకు సంబంధించిన 12 రకాల పనులను ఒకేసారి చేపట్టడం దీని ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ పనులు సరైన రీతిలో పూర్తి చేసుకున్న తర్వాత ఆ బడి విద్యార్థులను ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు. తల్లిదండ్రులూ తమ పిల్లలను ఫీజుల భారం తగ్గించుకోవడానికి ఈ బడుల్లో చేర్పిస్తారని వివరించారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టి కృషి, దాతల సహకారంతో బడిని అభివృద్ధి చేసుకున్నారని గుర్తు చేశారు. తాను ఈ మధ్య నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించానని తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఆమె భర్త లింగారావు సహకారంతో బడిని అభివృద్ధి చేయడం వల్ల ఆ గ్రామంలోని పిల్లలందరూ ఆ బడిలోనే చేరారని పేర్కొన్నారు. ఒకటో తరగతిలో 48 మంది విద్యార్థులున్నారని వివరించారు. ప్రతి తరగతిలోనూ 40కిపైగా విద్యార్థులున్నారని తెలిపారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయని వివరించారు. 'మన ఊరు-మనబడి' పథకాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. ఎస్ఎంసీ చైర్మెన్, సభ్యులు, సర్పంచ్ల సమన్వయంతో నడిపించే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని సూచించారు.