Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు కేటగిరీలుగా విభజన
- టీఎస్ఎంఐడీసీలో పీఎంయూ
- సీ కేటగిరీ పరికరాల నిర్వహణకు కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఐడీసీ) చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కొత్త విధానాలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వీ విడుదల చేశారు. పరికరాల మరమ్మతులు వెంటనే పూర్తయ్యేలా ఈ విధానాన్ని రూపొందించినట్టు పేర్కొన్నారు. వైద్యపరికరాలను ఎ, బి, సి, డి కేటగిరీలుగా విభజించారు. రూ.ఐదు లక్షలపై వ్యయం కలిగి కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్ (సీఎఎంసీ) వారెంటీ కలిగిన వాటిని ఎ కేటగిరీలో, ఆయా పరికరాలను సరఫరా చేసి అదే కంపెనీ నిర్వహణ కలిగి, పోస్ట్ వారంటీ పీరియడ్ కలిగిన వాటిని బి కేటగిరీలో, ఏడు సంవత్సరాలపైన వాడుతున్న పరికరాలను సి కేటగిరీలో చేర్చారు. రూ.ఐదు లక్షలలోపు విలువ కలిగిన పరికరాలను డి కేటగిరీలో చేర్చారు. ఎ, బి, సి కేటగిరీలోని పరికరాలను నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతను టీఎస్ఎంఐడీసీకి అప్పగించగా, మిగితా పరికరాల నిర్వహణ బాధ్యత సంబంధిత ఆస్పత్రిదేనని ప్రభుత్వం తెలిపింది.
పీఎంయూ....
అన్ని ఆస్పత్రుల్లోని పరికరాల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు టీఎస్ఎంఐడీసీలో ప్రోగ్రాం మేనేజ్ మెంట్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేయనున్నారు. పొరుగు సేవల ప్రాతిపదికన ప్రోగ్రాం మేనేజర్, బయోమెడికల్ ఇంజినీర్, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ఈ యూనిట్ పని చేయనున్నది. ప్రోగ్రాం మేనేజర్‌కు నెలకు రూ.ఒక లక్ష, బయోమెడికల్ ఇంజినీర్‌కు రూ.50 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.19,500 చొప్పున చెల్లించనున్నారు. మరమ్మతులకు సంబంధించి ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఫిర్యాదు చేసేందుకు వీలుగా మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటనెన్స్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఇఎంఐఎస్) సాఫ్ట్ వేర్‌ను నెల రోజుల్లో అభివృద్ధి చేయాలని టీఎస్ఎంఐడీసీ ఎండీని ఆదేశించారు.
కమిటీ ఏర్పాటు....
సి కేటగిరీలోని పరికరాల నిర్వహణ రేట్ల ఖరారు కోసం టీఎస్ఎంఐడీసీ ఎండీ సభ్య కార్యదర్శిగా కమిటీని ఏర్పాటు చేసింది. కాళోజీ నారాయణరావు వైస్ ఛాన్సలర్, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సాంకేతిక సలహాదారు ఇందులో సభ్యులుగా ఉంటారు.
నిధుల కేటాయింపు
డి కేటగిరీలోని పరికరాల నిర్వహణకు డిఎంఇ లేదా టీఎస్ఎంఐడీసీ నుంచి నిధులు విడుదల చేయా లని ప్రభుత్వం ఆదేశించింది. ఒక పడకకు ఏడాదికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.1000, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.1,500, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు రూ.2,000, బోధన, స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.2,500 చెల్లించాలని నిర్ణయించింది. ఈ విధానాల అమలుకు రూ.17.47 కోట్లు విడుదల చేయనున్నారు. విధానాల అమలుకు డీఎంఈ, వైద్య విధాన పరిషత్ కమిషనర్, టీఎస్ఎం ఐడీసీ ఎండీ, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులను తగిన చర్యలు తీసుకోవాలని రిజ్వీ ఆదేశించారు.