Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-అడిక్‌మెట్
భూదాన్ భూములను భూమిలేని నిరుపేదలకు పంచాలని, లేకుంటే తామే పంచుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అఖిల భారత సర్వసేవ సంఫ్‌ు-తెలంగాణ సర్వోదయ మండలి సంయుక్తంగా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ అధ్యక్షతన సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరాశ్రయులైన ప్రజల సంక్షేమం కోసం ఆచార్య వినోబా భావే భూదాన పోంచంపల్లి గ్రామంలో భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. భూస్వాముల నుంచి లక్షలాది ఎకరాల భూమిని విరాళంగా సేకరించారని తెలిపారు. కొన్ని భూములను పేదలకు పంచగా, మిగిలిన వేలాది ఎకరాల భూదాన్ భూములను అప్పటి ప్రభుత్వాల ఉదాసీనత వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా లాక్కున్నదని చెప్పారు. కొంత మంది డబ్బు, రాజకీయ మద్దతు ఉన్న వ్యక్తులు కూడా ఈ భూములను భూకబ్జాదారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం భూదాన భూములను రక్షించకుండా, పేదలకు పంపిణీ చేయకుండా, నూతనంగా భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. రైతుకు భూమి, పేదలకు గూడు అనేది నినాదం మాత్రమే కాదు, ఆచరణాత్మకం కావాలని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఆక్రమణకు గురైన భూదాన్ భూములను స్వాధీనం చేసుకొని కబ్జాదారులపై కఠిన చెర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా మిగిలి ఉన్న, పంపిణీ చేయని వివిధ జిల్లాల్లోని భూదాన్ భూములను గుర్తించి భూమిలేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు. జస్టిస్ (రిటైర్డ్) చంద్ర కుమార్ మాట్లాడుతూ.. భూమిలేని అణగారిన ప్రజలకు భరోసా కల్పించడం అనేది ప్రభుత్వ చట్టపరమైన బాధ్యత అన్నారు. భూదాన్ ఉద్యమంలో సేకరించిన భూమి ఎంత పంచారు? ఎంతమేరకు ఆక్రమణకు గురైంది? అనేది తేల్చడానికి ప్రభుత్వం చట్టపరమైన కమిటీని నియమించాలని, లేదా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆచార్య వినోబా భావే సేకరించిన భూదాన భూములను వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అజీజ్ పాషా మాట్లాడుతూ.. కొంతమంది భూకబ్జాదారులు తప్పుడు రికార్డులు సృష్టించి భూదాన్ భూములను ఆక్రమించి అమ్ముకుంటున్నారని చెప్పారు. కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఈ ధర్నాలో తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర నాయకులు పి.రాజు, శకావత్ చందు నాయక్, గజం మురళి, హనుమ నాయక్, షేక్ మహమూద్, అమీనా, భాస్కర్, ఫామీదా, దస్రు, కమలీబాయి, ప్రముఖ సంఘ సేవకులు కృష్ణప్రసాద్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి టి.నరసింహా హాజరయ్యారు.