Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట రైతు మహా ధర్నా
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, రైతు కూలీ సంఘం, భూ నిర్వాసితుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భూ నిర్వాసితులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సీపీఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మలీదు నాగేశ్వరరావు మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం, రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం భూ సేకరణ సందర్భంగా చెల్లించిన ఎకరాకు కోటి రూపాయలు నష్టపరిహారం ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయరహదారి భూ నిర్వాసితులకూ చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు రైతులకు జరుగుతున్న నష్టంపై నివేదిక నేషనల్ హైవే అథారిటీ అధికారులకు చెప్పి.. న్యాయమైన పరిహారం చెల్లించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం ప్రకటించకుండా గ్రీన్ఫీల్డ్ జాతీయరహదారికి శంకుస్థాపన జరపడం శోచనీయమన్నారు. భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందించే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎం) నాయకులు భూక్యా వీరభద్రం, నిర్వాసితుల నాయకులు దొబ్బల వెంగళరావు, వాసిరెడ్డి వరప్రసాద్, ఎస్.కె. మీరా, తాళ్ళపల్లి కృష్ణ, దొబ్బల విజయ, నున్నా సత్యనారాయణ, ఊదరపు వెంకటేశ్వరరావు, పేరం వెంకటేశ్వరరావు, రవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.