Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్
- బోధన్ ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన
నవతెలంగాణ-బోధన్
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ఇంటి ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు, క్యాజువల్ లేబర్, డైలీవేజ్ వర్కర్స్ తదితరులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు ఇస్తోందన్నారు. కానీ, గ్రామ పంచాయతీల్లోని సిబ్బంది వేతనాల పట్ల ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం.60 ప్రకారం వివిధ శాఖల్లో పనిచేసే వారికి కేటగిరీల వారీగా పెరిగిన వేతనాలను 2021 జూన్ నుంచి ఇస్తున్నారన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం పునరాలోచించి జీపీ సిబ్బందికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అందరికీ జీవో నెం.60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రాతిపదికన కార్మికులను నియమించాలని అన్నారు. జీఓ నెం.51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే షకీల్ ఆమేర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శంకర్‌గౌడ్, కుమారస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్, కార్మిక సంఘం నాయకులు అంజనేయులు, బాలాజీ, అబ్బాస్, ఐఎఫ్టీయూ నాయకులు పోశెట్టి తదితరులు పాల్గ్గొన్నారు.