Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో హఠాన్మరణం..పలువురి నివాళి..
- కుటుంబసభ్యులను ఓదార్చిన నేతలు
హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. సోమవారం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్టు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు. గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబారులో జరిగిన ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబారు ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు.
ఏపీలో అధికార వైసీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన విజయం సాధించారు. గత నెలలో మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకొని గౌతమ్‌రెడ్డి ఎదిగారు. ఆయన హఠాన్మరణం చెందారన్న విషయం తెలిసిన వెంటనే ఏపీ సీఎం జగన్, మంత్రులు ,ప్రతిపక్షనేత చంద్రబాబు సహ తెలంగాణ మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్‌గౌడ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తదితరులు గౌతమ్ రెడ్డి బౌతికాయాన్ని సందర్శించి, నివాళ్లు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.