Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల దుస్థితి
- వారి గోడు పట్టని యాజమాన్యం, పాలకులు
- ఒక్కొక్కరికి రూ.7-8 లక్షల బకాయిలు
- మనోవేదనతో అనారోగ్యం పాలవుతున్న కార్మికులు
నవతెలంగాణ-బోధన్
''నిజాంషుగర్ ఫ్యాక్టరీలో 28 ఏండ్లు పనిచేసిన కార్మికుడు షేక్ ఖాజా ఫ్యాక్టరీ లేఆఫ్ కావడం, ఉపాధి లేకపోవడం, వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దాంతో ఇబ్బందిగా మారడంతో తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యం పాలయ్యారు. చివరకు మతిమరుపు రావడంతో ఆ కుటుంబం ఆర్థిక జీవితం చిన్నాభిన్నమయింది. కనీసం ఆస్పత్రిలో చూపించుకుందామన్నా డబ్బులు లేని ధైన్య స్థితి నెలకొంది.''
ఆసియా ఖండంలోనే పేరు గాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ అది. అందులో కార్మికుడిగా పనిచేస్తే అదో గుర్తింపు. కాని నేడు అదే ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులకు బతుకు భారమై అన్నమో రామచంద్ర అంటూ వేడుకుంటున్నా పట్టించుకునే వారు లేరు. ఫ్యాక్టరీ మూతబడి ఏడేండ్లు గడుస్తున్నా.. అటు యాజమాన్యం, ఇటు పాలకులు ఆ వైపు చూసిన పాపానపోలేదు. దాంతో మనోవేదనకు గురవుతున్న కార్మికులు ఒక్కొక్కరిగా మంచాన పడుతున్నారు. వేతన బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయకపోవడంతో కార్మికుల కుటుంబ పోషణ భారమైంది. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లల పెండ్లి సైతం చేయలేకపోతుండగా.. మరికొందరు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు సైతం డబ్బులు లేని దుస్థితి నెలకొంది. ఓ పది కోట్ల మేర చెల్లిస్తే కార్మికుల కష్టాలు తీరుతాయని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.
వేతనాల కోసం పడరాని పాట్లు
2015 డిసెంబర్ 23న బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించడంతో కార్మికుల జీవితాల్లో చీకటి రోజులు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేటి వరకు కార్మికులకు జీతభత్యాలు, ప్రయోజనాలు ఏమి రాకపోవడంతో వారి బతుకులు దుర్భరంగా మారాయి. 137 మంది కార్మికులు ఇప్పటి వరకు రిటైర్ కాగా, ప్రస్తుతం 150 మంది కార్మికులున్నారు. వీరికి ఒక్కొక్కరికి సుమారు రూ.7 నుంచి 8 లక్షల వేతనంతో పాటు వేతన ప్రయోజనాలు రావాల్సి ఉంది. వీటి కోసం ఏండ్ల తరబడి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చివరికి ట్రిబ్యూనల్ కోర్టు కార్మికులకు న్యాయం చేయాలని ఆదేశించినా.. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు.
కార్మికుల గోడు పట్టని పాలకులు
తమ గోడును పాలకులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నికల కంటే ముందు ఎంపీ అరవింద్ మెట్పల్లి నుంచి పాదయాత్ర చేపట్టారు. పార్లమెంట్ సభ్యునిగా గెలిచినా తమ గోడు పట్టడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎంపీ కవిత సైతం ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపిస్తుందని హామీ ఇచ్చి విస్మరించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 2015 తర్వాత కార్మికులకు రిటైర్మెంట్ పీఎఫ్ డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, గ్రాడ్యూటీ సైతం రావాల్సి ఉందని కార్మికులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా కార్మికులు లేరనే కుట్రలు ప్రచారంచేసే పనిలో ఉందని వాపోయారు. ప్రభుత్వం, యాజమాన్యం చొరవచూపి రూ.9-10 కోట్ల నిధులు మంజూరు చేస్తే.. కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు అందుతాయనీ, స్పందించి కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.
షెడ్డు నిర్మాణానికి కార్మికుల యత్నం
ఇటు పాలకులు, అటు యాజమాన్యం పట్టించుకోకపోవడంతో చివరికి ఓపిక నశించిన కార్మికులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైయ్యారు. ఫ్యాక్టరీ ఎదుట షెడ్డు నిర్మించి ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యాజమాన్యం పోలీసుల అండతో షెడ్డు తొలగింపజేసి అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైద్యానికి డబ్బుల్లేక మంచానికి పరిమితం..
ఫ్యాక్టరీ లే ఆఫ్ అయినప్పటి నుంచి వేతనాలు లేక ఆర్థికంగా చితికిపోయాం. అనారోగ్యంతో ఉన్నా అప్పులు చేసి కూతురి పెండ్లి చేశాను. ఒక బాబు చదువుకుంటున్నాడు. ప్రస్తుతం బ్యాక్ పెయిన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వైద్యానికీ డబ్బుల్లేక మంచానికే పరిమితమయ్యా..
- అక్కపెల్లి మల్లేశం, కార్మికుడు