Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
- ప్రకృతినే పెద్ద కమ్యూనిస్టు : జయరాజు
- వచ్చిన విప్లవాలన్నీ రెడ్‌బుక్ స్ఫూర్తితోనే : యాకూబ్
- చదివేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి: శాంతాకుమారి
- రెడ్‌బుక్స్‌డే సందర్భంగా ఎస్వీకే వద్ద కవితా పఠనం
- పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక కష్టజీవుల వెలుగురేఖ అని తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. రెడ్‌బుక్ డే సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట తెలంగాణ సాహితి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ సంయుక్త ఆధ్వర్యంలో నవతెలంగాణ బుకహేౌజ్ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్ అధ్యక్షతన కవితా పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ..మనుషులను ఆచరణ వైపు నడిపించే పత్రం కమ్యూనిస్టు ప్రణాళిక అన్నారు. ఘర్షణల నుంచే సమాజ మార్పు జరుగుతుందనీ, అది అనివార్యమని నొక్కి చెప్పారని తెలిపారు. దోపీడీదారులెవరు? దోపిడీకి గురయ్యేవారెవరు? సమాజంలో అణచివేత ఏవిధంగా జరుగుతున్నది? అనే విషయాలను మార్క్స్, ఏంగెల్స్ స్పష్టంగా వివరించారన్నారు. సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులు కాదనీ, శ్రామికులేనని నొక్కిచెప్పిన మహనీయులన్నారు. కరోనా కష్టకాలంలో దేశంలోని ప్రజలంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అంబానీ, ఆదానీ సంపాదన 300 శాతం ఎట్లా పెరిగిందని ప్రశ్నించారు. డాక్టర్లు, కవులు, సైంటిస్టులు, ఉపాధ్యాయులు పెట్టుబడిదారుల కింద కూలీలుగా మారిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాన్ని, సత్యాన్ని, శాస్త్రీయతను చెప్పి ప్రజలను మేల్కొల్పేదే కమ్యూనిస్టు ప్రణాళిక అన్నారు. వాగ్గేయకారుడు జయరాజు మాట్లాడుతూ.. అందరికీ గాలి, నీరు, సూర్యరశ్మి, తదితరాలను సమానంగా పంచే ప్రకృతే పెద్ద కమ్యూనిస్టు అని అభివర్ణించారు. ఆ ప్రకృతే తిరుగుబాటునూ నేర్పుతుందనీ, ప్రోత్సహిస్తుందని చెబుతూ పులి-చీమల కథ ద్వారా వివరించారు. అన్యాయాన్ని ఎదిరించడానికి, పేదల పక్షాన పోరాడటానికి మార్క్స్, ఏంగెల్స్ మహనీయులు పుట్టారన్నారు. తమ గ్రంథాల ద్వారా ప్రపంచానికి చైతన్యాన్ని నింపిన గొప్ప వ్యక్తులన్నారు. సమసమాజ ఆశయసాధనలో మార్గాలు వేరైనా కమ్యూనిస్టులంతా మార్క్స్, ఏంగెల్స్ బాటలో నడుస్తున్నారని చెప్పారు. ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడుతూ.. 174 ఏండ్ల కింద రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రాసంగికత నేటికీ అట్లాగే ఉందన్నారు. ఆ పత్రం కొందరికి కాదు..అందరికీ వర్తిస్తుందని చెప్పారు. కమ్యూనిస్టు ప్రణాళిక స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమసమాజ నిర్మాణం కోసం జరిగే పోరులో కమ్యూనిస్టు ప్రణాళిక కరదీపికగా ఉపయోగపడుతుందని చెప్పారు. కన్నడ కవి శాంతాకుమారి మాట్లాడుతూ..కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచానికే దిక్సూచి అన్నారు. ఆ పత్రం చదివేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆ మహనీయులు కొవ్వొత్తులు పెట్టుకుని మరీ ఆ పత్రాన్ని రాశారని గుర్తుచేశారు. అనంతరం సాహితీ నాయకులు తంగిరాల చక్రవర్తి, మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో కవితా పఠనం చేపట్టారు. పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు.
మార్క్సిస్టు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం అభినందనీయం
పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్
నవతెలంగాణ ప్రచురణలపై 30 శాతం డిస్కౌంట్ : చంద్రమోహన్
నవతెలంగాణ బుకహేౌజ్లో రెడ్‌బుక్ డే సందర్భంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమని నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ అన్నారు. రెడ్ బుక్ డే సందర్భంగా నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని బుకహేౌజ్లో వారంపాటు నిర్వహించే పుస్తకప్రదర్శనను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు ప్రణాళికను మార్స్క్, ఏంగెల్స్ ప్రకటించి ఫిబ్రవరి 21కి 174 ఏండ్లు అయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తక పఠనం జరిగిందన్నారు. పుస్తక పఠనం తగ్గి యువత పక్కదారి పడుతున్న సందర్భంలో మార్క్సిస్టు సాహిత్యాన్ని అందరూ చదివేలా చేయడంలో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ ముందు వరుసలో ఉందన్నారు. పుస్తక ప్రదర్శనలో విస్తారంగా లెఫ్ట్ సాహిత్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు. నవతెలంగాణ బుకహేౌజ్ జనరల్ మేనేజర్ కె.చంద్రమోహన్ మాట్లాడుతూ..174 ఏండ్ల కిందటిది అయినప్పటికీ నేటికీ కమ్యూనిస్టు ప్రణాళికకు ప్రాధాన్యత తగ్గలేదన్నారు. సూర్యచంద్రులున్నంతకాలం, శ్రమజీవులున్నంతకాలం కమ్యూనిస్టు ప్రణాళిక ఉంటుందన్నారు. రెడ్బుక్డే సందర్భంగా వారం పాటు నవతెలంగాణ ప్రచురణలను 30 శాతం రాయితీతో ఇస్తామన్నారు.