Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
- తరలిరానున్న రెవెన్యూ గ్రామ సహాయకులు
- పేస్కేలు, పర్మినెంట్, ప్రమోషన్లు తదితర డిమాండ్లతో ముందుకు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'పేస్కేలు ఇస్తాం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం. సొంతూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం' వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ముఖ్యమైన హామీలివి. ఇదిగో..అదిగో...అంటూ సీఎం దగ్గర పరపతి ఉన్న రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పే మాటలను నమ్ముతూ పోయారు. పాలాభిషేకాలూ చేశారు. అయినా ఫలితం శూన్యం. ఏండ్ల పడాంతరం ఆశతో ఎదురుచూసినా ఒక్కడుగూ ముందుకు పడలేదు. ఉన్నాతాధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. దీంతో విసిగివేసారిన వీఆర్ఏలంతా ఆందోళనబాట పట్టారు. ఈ నెల ఏడో తేదీన మండల కేంద్రాల్లో తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. పదోతేదీన కలెక్టరేట్లనూ ముట్టడించారు. కనిపించిన ప్రజాప్రతినిధికల్లా వినతిపత్రాలిచ్చారు. అయినా, సర్కారులో చలనం లేకపోవడంతో తమపోరును రాష్ట్ర కేంద్రంలో నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద మంగళవారం తెలంగాణ రిక్రూట్మెంట్ రెవెన్యూ సహాయకుల సంఘం, తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు జిల్లాల నుంచి వేలాది మంది తరలి వచ్చే అవకాశముంది.
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో దాదాపు 24 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారే. అందులోనూ సగానిపైగా వృద్ధులు. ఎక్కువగా చదువురానివారే. వీరంతా రెవెన్యూ, పోలీసు అధికారులకు సహకరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిన సందర్భంలో వారందర్నీ సీఎం ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. 2017 ఫిబ్రవరి 24న అర్హతగలిన వీఆర్ఏలందరికీ వాచ్మెన్లు, జీపుడ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్లు కల్పిస్తామనీ, సొంతూరులో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని భరోసానిచ్చారు. అయితే ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2020 సెప్టెంబర్‌లో వీఆర్వో వ్యవస్థ రద్దుపై అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినా...విపత్తులు, అత్యవసర సమాచారాలు అందించేందుకుగానూ ఊరికో వీఆర్ఏ అట్లాగే ఉంచుతామనీ, వారికి పేస్కేలు వర్తింపజేస్తామని హామీనిచ్చారు. వీఆర్ఏలంతా దళితులు, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారేననీ, ఖచ్చితంగా న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. మినిమం పే స్కేల్ వర్తింపజేసేందుకు రూ.250 కోట్లు అయితే సరిపోతుందని కూడా చెప్పారు. తండ్రుల స్థానంలో వారసులకు ఉద్యోగాలిచ్చే అవకాశాన్నీ పరిశీలిస్తామని ఆ సందర్భంగా అన్నారు. నెల అయిపోయింది..ఆరునెలలు దాటింది..ఏడాది గడిచిపోయింది...ప్రస్తుతం ఏడాదిన్నర అయింది. హామీ మాత్రం నెరవేరలేదు. ప్రస్తుతం వారికి డీఏలతో కలిపి వేతనం రూ.10,500 మాత్రమే అందుతున్నది. కొందరైతే చేసిన కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన రమేశ్ అనే వీఆర్ఏ ఇటీవలే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఓ వీఆర్ఏ ఇసుక మాఫియా చేతిలో హత్యకు గురయ్యాడు. డైరెక్ట్ వీఆర్ఏలు ఐదేండ్లు పనిచేస్తే ప్రమోషన్లు ఇవ్వాలి. పదేండ్ల సర్వీసు దాటిని ప్రమోషన్ మాట ఎరుగరు. దీంతో ప్రభుత్వపరంగా దక్కాల్సిన బెనిఫిట్స్‌కు వారు నోచుకోలేకపోతున్నారు. అరకొర వేతనాలు చాలక వీఆర్ఏల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ.10,500తో ఎట్టా బతకాలి?
రూ. 10,500 వేతనంతో ఎట్టా బతకాలి? అందరికీ పెరిగిన వేతనాలు ఇస్తున్నారు. వీఆర్ఏలకు ఎందుకు వర్తింపజేయరు? సీఎంసార్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వేడుకుంటున్నాం. పదేండ్లనుంచి పనిచేస్తున్న మాకు ఉద్యోగోన్నతి కల్పించాలి. వారసత్వ పద్ధతితో కొనసాగుతున్న వీఆర్ఏలనూ పర్మినెంట్ చేయాలి. వారి వారసులకు ఉద్యోగాలివ్వాలి. జాబ్‌చార్టు రూపొందించాలి. ఇసుకమాఫియా, రియల్ మాఫియా దాడుల నుంచి రక్షణ కల్పించాలి.
- కందుకూరి బాపుదేవ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రధాన కార్యదర్శి
పేస్కేలు ఇవ్వాలి..వారసులకు ఉద్యోగాలివ్వాలి
వీఆర్ఏలందరికీ పేస్కే లు వర్తింపజేయాలి. తండ్రుల స్థానంలో పనిచేస్తున్న వీఆర్ఏలందర్నీ పర్మినెంట్ చేయాలి. వారంతా బీపీఎల్ కుటుంబాలకు చెందినవారే కనుక ఇచ్చిన హామీ ప్రకారం వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలి. కరోనా సమయంలో విధినిర్వహణలో చనిపోయిన వారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. మానసిక, పని ఒత్తిడితో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి. అధికారులకు సొంతసేవలకు వీఆర్ఏలను వాడుకోవద్దని సర్వీస్రూల్లో స్పష్టంగా ఉన్నా అది అమలు కావట్లేదు. 24 గంటలూ పనిచేయించడం దారుణం.
- వంగూరు రాములు, తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రధాన కార్యదర్శి