Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలను అనుమతించాలి
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: టీఎస్ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్లో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ఎప్పటికీ ప్రజారవాణానే అనీ, దాన్ని లాభనష్టాల వ్యాపార కోణంలో చూడరాదని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జీ హరగోపాల్ అన్నారు. ఆ సంస్థను ప్రజల నుంచి దూరం చేయాలనే ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచే ఉద్యమం ఆవిర్భవించాలని చెప్పారు. అలాంటి ఉద్యమాన్ని కార్మిక సంఘాలు అందిపుచ్చుకోవాలనీ, సంస్థ పరిరక్షణతోపాటు సామాజిక సేవా బాధ్యతనూ చేపట్టాలని పిలుపునిచ్చారు. తొమ్మిది కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్) అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన ఉద్యమ నాయకత్వానికి సామాజిక అవగాహన ఉంటుందని తాము భావించామనీ, కానీ స్వరాష్ట్ర సాధన తర్వాత అలాంటిదేం కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారనీ, వాటిని అమలు చేయాల్సిన ఉద్యమ నాయకత్వం ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం దిగ్భ్రాంతికరమనీ, చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఆర్టీసీ బస్సులపై టీడీపీ నినాదాలు రాయించాలనే ఫైల్‌ను పంపితే, అప్పటి రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న ఎస్ఆర్ శంకరన్ దాన్ని తిప్పి పంపారనీ, ఆర్టీసీ బస్సు ప్రజలదే తప్ప, పార్టీలది కాదని నేరుగా ఎన్టీఆర్‌కు చెప్పారని గుర్తుచేశారు. అలాంటి అధికారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చెప్పినా, పట్టించుకొనే రాజకీయ చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, రైల్వే, రక్షణరంగం సహా అన్నింటినీ కేంద్రప్రభుత్వం అమ్మకానికి పెట్టిందనీ, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నదని దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ మనుగడను ప్రశ్నించే వారు కార్లలో తిరుగుతున్నారనీ, బస్సులో ప్రయాణించే సామాన్యులు ప్రశ్నించలేకపోతున్నారని విశ్లేషించారు. బస్సుపై ఆధారపడిన సాధారణ ప్రయాణీకుల సమీకరణ జరగాలనీ, దాన్ని కార్మిక సంఘాలు అందిపుచ్చుకోవాలని చెప్పారు. స్వీడన్లో ఒక్క కంపెనీలో సమ్మె పిలుపు ఇస్తే, అక్కడి కార్మిక సంఘాలన్నీ దానిలో భాగాస్వామ్యం అవుతాయనీ, ఇక్కడ కూడా సంఘాల మధ్య ఆ తరహా ఐకమత్యం పెరగాలని ఆకాంక్షించారు.
బడ్జెట్లో 2 శాతం నిధులు కేటాయించాలి
రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలనీ, అప్పులను ఈక్విటీగా మార్చాలనీ, సంక్షేమ మండళ్లను రద్దు చేసి, సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వీఎస్ రావు (ఎస్‌డబ్ల్యూఎఫ్) సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2017, 2021 వేతన ఒప్పందాలు, ఆరు డిఏలనూ చెల్లించాలని దానిలో పేర్కొన్నారు. ఏడేండ్లలో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సగటున కేవలం రూ.145 కోట్లు మాత్రమే ఇచ్చిందని గణాంకాలతో వివరించారు. రూ.1,600 కోట్ల విలువైన ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఎన్నికలు నిర్వహించేందుకు యాజమాన్యం సహకరించాలనీ, బకాయిలు చెల్లించాలని కోరారు. 2021 ఫిబ్రవరి 7న విడుదల చేసిన ఉద్యోగభద్రత మార్గదర్శకాలను ఆరునెలల తర్వాత సమీక్ష చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందనీ, అది ఇప్పటికీ జరగలేదని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఆర్టీసీ విస్తరణ, కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఏకగ్రీవ ఆమోదం
సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కార్మిక సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, ఎమ్ శ్రీనివాస్, కే సూర్యం ఆమోదం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను వివరించారు. ప్రజా ఉద్యమాల ఆవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్ (టీజేఎమ్‌యూ), కన్వీనర్ పి కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు జీ అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), కే యాదయ్య (బీకేయూ), ఎస్ సురేష్ (బీడబ్ల్యూయూ), సత్యనారాయణగౌడ్ (ఎస్‌టీఎమ్‌యూ) తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ సంస్థ స్థితిగతులపై ప్రత్యేకంగా లేఖలు రాయాలని నిర్ణయించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.