Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు అవినీతిపై న్యాయపోరాటం: రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాఫెల్‌ను మించిన భారీ బొగ్గు కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి కంపెనీకి బొగ్గు తొవ్వే సామర్థ్యం ఉన్నప్పటికీ టెండర్లు పిలుస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కుమ్మక్కై రూ 50వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ భారీ కుంభకోణం వెనుక వారి స్వార్థ ప్రయోజనాలున్నాయని చెప్పారు. గత ఎనిమిదేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా సీఎండీ శ్రీధర్‌ను కొనసాగించడంలో ఆంతర్యమిదేనని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, మల్లురవి, ప్రీతం, హర్కర వేణుగోపాల్, రాగిడి లక్ష్మారెడ్డి, మెట్టు సాయి కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర వాటా 51 శాతం, కేంద్ర వాటా 49శాతంగా ఉందన్నారు.ఆ కంపెనీ 50 వేల మంది ఉద్యోగ, కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. సింగరేణి గనులను ప్రయివేటు సంస్థలకు అమ్మేందుకు ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదని విమర్శించారు. అత్యంత నాణ్యమైన బొగ్గు సింగరేణిలో ఉందనీ, సాంకేతిక అవసరం లేకుండానే బొగ్గు తీయొచ్చు కానీ అలాంటి బొగ్గును సింగరేణికి కాకుండా ప్రయివేటు సంస్థలకు 25 ఏండ్లపాటు లీజుకు ఇచ్చేందుకు కేసీఆర్ తన అధికారాన్ని వినియోగించి ప్రయివేటు పరం చేస్తున్నారని విమర్శించారు. అందుకే సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగిస్తున్నారని చెప్పారు. కేసీఆర్, ఆయన కలిసి వేలాది కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. బొగ్గుకుంభకోణంపై సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రధాని, హోంమంత్రి, విజిలెన్స్, మంత్రులు, అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నైని బొగ్గు తవ్వకాలకు సంబంధించిన టెండర్ బాక్స్ ఓపెన్ చేస్తే.. ఇద్దరు,ముగ్గురికే లాభం చేకూరుతుందన్నారు. ఈ విషయాన్ని శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లగా.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దీని ద్వారా మోడీ స్నేహితుడు అదానీ, సీఎం కేసీఆర్ బినామీ ప్రతిమ శ్రీనివాస్ భారీగా లబ్దిపొందనున్నట్టు ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం గనులను దోచుకునే పని చేస్తున్నదనీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
మోడీ కోసమే కేసీఆర్ పొర్లు దండాలు
మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకే కేసీఆర్ పొర్లు దండాలు పెడుతున్నారని రేవంత్ చెప్పారు. జైల్ నుంచి తప్పించుకునేందుకే మోడీతో రహస్య ఒప్పందం జరిగిందనీ, అందులో భాగంగానే యూపీఏ భాగస్వామ్య పక్షా లను చీల్చించేందుకే మోడీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. పైకి మాత్రం బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ అవినీతిపై మాట్లాడారని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య విభేదాలున్నాయంటూ ప్రజలను నమ్మించేందుకే ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పు, నిప్పులా ఉన్నట్టు చూపిస్తున్నారని తెలిపారు. ముంబాయి పర్యటన ఓ డ్రామాంటూ రేవంత్ విమర్శించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులపై కేసీఆర్‌తో చర్చించినట్టు శరద్‌పవర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎంపీ సుప్రియ సురే ట్వీట్లు చేశారనీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు మాత్రం మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడలేదన్నారు. కేసీఆర్.. చీటర్, లయర్ అండ్ లూటర్ అని ఎద్దేవా చేశారు. పార్టీ అలకబూనిన ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు.