Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- టీఎస్ఈఆర్సీ బహిరంగ విచారణలో సీపీఐ(ఎం), కాంగ్రెస్ ఆందోళన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్పీడీసీఎల్ ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు కేంద్రం విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కమిషన్ సిఫారసు చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి.. విద్యుత్ ఛార్జీల పెంపుపై సోమవారం బహిరంగ విచారణ చేపట్టింది. మండలి చైర్మెన్ శ్రీరంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, కృష్ణయ్య విచారణ నిర్వహించారు. తొలుత ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ప్రతిపాదిత ఛార్జీల పెంపు ఆవశ్యకత, కంపెనీ నష్టాలను వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల నేతలు, రైతులు తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టంతో మున్ముందు క్రాస్ సబ్సిడీలుండవన్నారు. ఈ చట్టంతో ఫెడరల్గా రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యుత్ కేంద్ర జాబితాలోకి వెళ్లిపోతుందని తెలిపారు. దాంతో ఇక ముందు ఉచిత విద్యుత్ ఉండదని అన్నారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ కోరాలని సూచించారు. గత నాలుగేండ్లుగా ఈఆర్సీ కార్యాచరణలో లేదనీ, ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఇవి పనిచేయడం విచారకరమన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ పెట్టిన ప్రతిపాదిత విద్యుత్ చార్జీల పెంపు అశాస్త్రీయంగా ఉందని తెలిపారు. ప్రతి కేటగిరికి గుండు గుత్తాగా యూనిట్‌కు 0.50 పైసలు, యూనిట్‌కు రూ.1 పెంచాలని ప్రతిపాదించారన్నారు. గృహ వినియోగదారులపైనే 30 శాతానికి పైగా ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. ఇది రాష్ట్రంలో 50 లక్షల మంంది వినియోగదారులపై భారం పడుతుందన్నారు. డెవలప్మెంట్ ఛార్జీల పేరిట వినియోగదారులపై భారాలు మోపడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లాలోనే రూ.100 కోట్ల భారాన్ని వేశారని తెలిపారు. రూ.200 బిల్లు చెల్లించే వాళ్లకు డెవలప్మెంట్ ఛార్జీల మోతతో రూ.2 వేల నుంచి రూ.5 వేల మేరకు బిల్లులు వేశారన్నారు. డిస్కంలకు 20 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని తేల్చగా, కంపెనీ 25 వేల మెగావాట్ల విద్యుత్ అవసరముందని ప్రతిపాదించడంలోని ఆంతర్యాన్ని ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 600 మంది విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్టు చెబుతున్నారన్నారు. ఈఆర్సీ ప్రత్యేకంగా కమిషన్ వేస్తే ట్రాన్స్ఫార్మర్ల దుస్థితిని స్వయంగా చూపిస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. ఆర్టిజన్స్‌కు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాల్సి ఉండగా వెట్టి చాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనలో తిండి పెట్టి వెట్టి చాకిరి చేయిస్తే ఎన్పీడీసీఎల్లో తిండి పెట్టకుండానే వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత చర్యలతో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. ఉత్పత్తికి, సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించక తప్పులు చేశారన్నారు. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేయొద్దన్నారు. కొత్తగా అవసరమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేయాలన్నారు. సౌరశక్తిని వినియోగించుకోవాలని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చినట్లే, పేదలకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడా పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి చౌకగా కరెంట్ ఇవ్వడంతో పేదలపై భారం పడుతుందన్నారు. విద్యుత్తు కొనుగోలు విధానాన్ని సమీక్షించుకోవాలని సూచించారు.