Authorization
Sat March 29, 2025 07:08:46 am
- పోరాటానికి నేను సిద్ధం
- మత విద్వేషాలున్న చోట అభివృద్ధి జరగదు: ఖేడ్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్..
- సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణానికి భూమిపూజ
- రూ.4 వేల కోట్లతో 4లక్షల ఎకరాలకు సాగునీరు
నవతెలంగాణ-నారాయణఖేడ్, మెదక్డెస్క్
'దేశంలో నేడు దుర్మార్గపాలన సాగుతోంది. కులం, మతం, వర్గాల పేరిట విద్వేషాలు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా నేటికీ దౌర్భాగ్య స్థితిలోనే దేశం కొట్టుమిట్టాడుతున్నది. దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. భారతదేశాన్ని బాగు చేయాలి. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని అభివృద్ధి చేద్దాం. మనం ఇతర దేశాలకు పోవడం కాదు.. ఇతర దేశాల వారు వీసాలు తీసుకుని ఇక్కడికి రావాలి. అందుకోసం పోరాటానికి నేను సిద్ధమయ్యాను. మీరూ కొట్లాడాలి' అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజల్పూర్ శివారులోని ఆంధ్ర డిగ్రీ కాలేజీ సమీపంలో రూ.4,427 కోట్లతో నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఒకప్పుడు ఎంపీ ఎన్నికల సమయంలో అల్లాదుర్గ్‌లో జరిగిన సమావేశానికి హాజరై.. కాళేశ్వరం పూర్తి అయితే అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి తెచ్చిచ్చే బాధ్యత తనదే అని చెప్పాననీ, అదేవిధంగా నేడు సుమారు 4లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు కోసం రూ.4వేల కోట్లతో శంకుస్థాపన చేశామని తెలిపారు. ఏడాదిన్నర లోపు ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని తెప్పించాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు వచ్చే నీటికంటే ఎక్కువగా అందోల్‌కు నీరు రానున్నదన్నారు. అందోల్ నియోజకవర్గంలో 1.70లక్షల ఎకరాలకు నాలుగు ప్రాజెక్టుల ద్వారా నీరు అందుతుందని చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి సుమారు 300 కి.మీ ప్రయాణించి సింగూరుకు లిఫ్ట్ ద్వారా నీళ్లు రానున్నాయన్నారు. సింగూరులో 14 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్‌లోకి వదులుతామని తెలిపారు.
జహీరాబాద్, సంగారెడ్డి పట్టణాలకు రూ.50కోట్లు మంజూరు..
జహీరాబాద్, సంగారెడ్డి పట్టణాలకు ఒక్కోదానికి రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఖేడ్, జోగిపేట, సదాశివపేట, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాల్టీలకు రూ.25 కోట్లు, జిల్లాలోని 699 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలను మంజూరు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఇందుకు సంబంధించి రేపు జీఓ విడుదల చేస్తామన్నారు. త్వరలోనే సమావేశం పెట్టి తాండాలకూ నిధులు మంజూరు చేయించి రోడ్లు వేయిస్తామని తెలిపారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను జూన్‌లోపు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అలాగే నిజాంపేటను మండలంగా ఏర్పాటు చేస్తామన్నారు.
వారం, పదిరోజుల తర్వాత కేతకి సంగమేశ్వరకు వస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. అదే సమయంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామని తెలిపారు. సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్, ఎంపీ బీబీ పటేల్, ఎమ్మెల్యేలు మహా రెడ్డి భూపాల్ రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, పద్మ దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.