Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహణ లేక అస్తవస్త్యంగా మారిన పరిశుభ్రత
- రాళ్లు, నూకలు, పురుగులు ఉన్న బియ్యం
- భయం భయంగానే అన్నం తింటున్న పరిస్థితి
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
- అవస్థలు పడుతున్న విద్యార్థులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముద్ద అన్నం.. అన్నంలో పురుగులు, రాళ్లు, బ్రేక్‌ఫాస్ట్ లేకుండా మూడు పూటల అన్నం.. నాణ్యత లేని భోజనం.. బకెట్లు, మగ్లు లేవు.. మరుగుదొడ్లలోనే మూత్ర విసర్జన, స్నానం.. సరిపడా టారులెట్లు లేవు.. నీటి సమస్య, బాత్రూమ్ ఫైప్‌లైన్ లీకేజీలతో విద్యార్థుల రూమ్‌ల్లోకి నీరు.. భరించలేని దుర్వాసన, అపరిశుభ్రమైన వాతావారణం, ఒక్కో గదిలో 20 నుంచి 40 మంది విద్యార్థులు.. 300 మంది వసతి పొందుతున్నారు. రూమ్‌లో ఫ్యాన్లు, లైట్లు లేక ఇబ్బందులు.. కాలేజీలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. నేటికీ చాలామందికి బెడ్షీట్లు, ట్రంకు పెట్టెలు, షూలు ఇవ్వని వైనం. వాచ్మెన్, సిబ్బంది కొరత.. లైబ్రరీ లేదు.. వైఫై కనెక్షన్ ఇవ్వక పుస్తకాల్లేక కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి గ్రంథాలయల్లో చదువుకుంటున్న దుస్థితి నెలకొంది. ఇది మెహిదీపట్నం, చింతలబస్తీ పోస్ట్ మెట్రిక్ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి.. కేవలం ఈ రెండు హాస్టళ్లకే పరిమితం కాలేదు.. గ్రేటర్ పరిధిలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఇవే పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం విడి.. తమకు మంచి భోజనం, సౌకర్యాం కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు.. నేడు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ల పేరుతో కొనసాగిన సంక్షేమ హాస్టళ్లు నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజీ, ప్రీ మెట్రిక్ హాస్టళ్ల పేరుతో కొనసాగుతున్నాయి. గ్రేటర్‌లోని వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమా తదితర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వసతి పొందుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్(ఎస్సీ) పోస్ట్ మెట్రిక్ కళాశాల హాస్టళ్లు 24 ఉండగా.. ఇందులో 23 హాస్టళ్లు ప్రయివేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోని 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు.. 12 ప్రీమెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతావి ప్రయివేటులోనే కొనసాగుతున్నాయి.
యాజమానులు.. అధికారుల కుమ్మక్కు..!
ప్రయివేటు భవనాల్లో కనీస వసతి సౌకర్యాలు లేకపోగా.. ప్రతి నెల అద్దె ఒక్కొక్క బిల్డింగ్‌కు లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. మెహిదీపట్నం, చింతలబస్తీ బిల్డింగ్‌కు నెల అద్దె రూ.5 లక్షలకుపైనే చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఇలా అద్దె చెల్లింపులకే ఏడాదికి కోట్లలో ఖర్చుపెడుతోంది. ఈ డబ్బుతో ప్రభుత్వమే హాస్టళ్లు నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ భవనాల్లో విద్యార్థుల సంఖ్య వారి అవసరాలకు సరిపడా టాయిలెట్స్, బాత్రూమ్లు లేవు. చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రయివేటు యాజమానుల నుంచి ప్రిన్సిపాల్స్, రిజనల్ కో-ఆర్డినేటర్స్, జిల్లా వెల్ఫేర్ అధికారులకు వారి వారి స్థాయిని బట్టి భారీగా డబ్బు చేతులు మారుతున్నట్టు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఈ అద్దె హాస్టళ్లలో రీడింగ్ రూమ్, లైబ్రరీ, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వారి అవసరాలను తీర్చడం లేదు. పోస్టు మెట్రిక్ హాస్టల్స్‌లో డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు వారి సబ్జెక్టు పుస్తకాలు అందుబాటులో లేవు. హాస్టళ్లలో కోర్సు పూర్తి కావస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపాధి కల్పనా ధ్యేయంగా ఎలాంటి స్కిల్ అండ్ సబెక్టు డెవలప్మెంట్ కోచింగ్ కోర్సులను బోధించడం లేదని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
కోవిడ్ నిబంధనలు బాలాదూర్
కరోనా కట్టడికి భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజేషన్ అతిముఖ్యం. కానీ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు నివసించే గదుల్లో ఆ నిబంధనలు అమలు కావడం లేదు. ఒక్కో గదిలో సైజ్‌ను బట్టి 20 నుంచి 40 మందికిపైనే ఉంటున్నారు. సరిపడా స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోగా అపరిశుభ్ర వాతవారణం రాజ్యమేలుతున్నది. టారులెట్లు, వంటశాలలకు సరిపడా సిబ్బంది లేరు. ఇక ప్రభుత్వ ప్రకటించిన పౌష్టికాహార భోజన మెనూ సంక్షేమ వసతిగృహంలో అమలు కావడం లేదు. ఇడ్లీ, పల్లి చట్నీ, మైసూరు బజ్జీ, పూరి వంటి అల్పాహార మెనూ ఇప్పటికీ అమలు కావడం లేదు. మధ్యాహ్న భోజనంలో అందించాల్సిన కూరగాయల కూరను వండకుండా పప్పుతో సరిపెడుతున్నారు. రోజూ ఇదే పరిసితి. రాత్రి భోజనంలో గుడ్డు లేదా అరటి పండు ఇస్తున్నా.. అది అంతంతే. చికెన్ భోజనం ఆదివారం డిన్నర్లో మాత్రమే. పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం, వార్డెన్ల అవినీతితో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. బాలికలు రక్తహీనత బారినపడుతున్నారు. కాబట్టి ఇకనైనా అధికారులు నిర్లక్ష్యం వీడాలని.. తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
మంచి భోజనం కావాలి : ఓ విద్యార్థి, కాలా టవర్స్ హాస్టల్
అన్నంలో పెద్ద పెద్ద రాళ్లతో పాటు తింటుంటే నోటికి ఇసుక తగులుతుంది. అన్నం తినే పరిస్థితి లేదు. బయట తినే స్తోమత లేదు. చిన్న వయసులోనే ఆర్యోగ సమస్యలు వస్తాయోనని భయంగా ఉంది. ప్రభుత్వం పర్యవేక్షణ పెంచి తమకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలి.
అధికారుల పర్యవేక్షణ పెరగాలి
నగరంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌పై అధికారులు, ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అద్దె భవనాల్లో సరైన వసతులు లేక.. లక్షల్లో అద్దె చెల్లింపులతో యజమానులకు మేలు తప్ప.. విద్యార్థులకు ఉపయోగం లేదు. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలి. రాబోయే బడ్జెట్లో నిధులు పెంచి కేటాయించాలి. వార్డెన్ల నియామకాలు చేపట్టాలి.
-జావిద్, నగర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ
సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై సమీక్షేది
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. ఏడేండ్ల కాలంలో ఒక్కసారి సీఎం కేసీఆర్ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై సమీక్ష జరపకపోవడమే ఇందుకు నిదర్శనం. సంక్షేమ హస్టళ్లకు పక్కా బిల్డింగులు నిర్మించకుండా వాటిని ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారు. వసతిగృహాలకు సన్నబియ్యం పంపుతున్నామని అంటున్న ప్రభుత్వ పాలకులు.. రాళ్లు, నూకలు, పురుగులు ఉన్న బియ్యం పంపుతున్నారు.
- కె.ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీడీఎస్‌యూ(విజృంభణ)