Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాతో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ పట్ల, ఇక్కడ చేపట్టాల్సిన ప్రాజెక్టులపట్ల కేంద్రంలోని మోడీ సర్కారు... కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే 'బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు...'అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారని విమర్శించారు. రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై మోడీ సర్కారు తీరుకు నిరసనగా బుధవారం బయ్యారంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షను నిర్వహిస్తా మని ఆయన వెల్లడించారు. కలిసొచ్చే పార్టీలు, సంఘాలను కలుపుకుని పోతామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంటులో సైతం లేవనెత్తుతామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, మంత్రి పువ్వాడ అజయకుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి నామా మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సైతం కేంద్రం తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలో 40 నుంచి 60 శాతం వరకూ ముడి ఖనిజం ఉందంటూ పలు సర్వేలు, నివేదికలు తేల్చి చెప్పాయని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి 2009లో అప్పటి ప్రభుత్వం జీవోనెం.69ను, 2010లో జీవోనెం.64ను విడుదల చేసిందని వివరించారు. మరోవైపు తెలంగాణ సంపద తెలంగాణకే దక్కాలంటూ కోర్టులు సైతం ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ల(ఆర్ఆర్ఆర్)కు సంబంధించి ఏ రాష్ట్రానికైనా కేంద్రమే నిధులను విడుదల చేస్తున్నదని చెప్పారు.కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం భూ సేకరణ (ల్యాండ్ కాస్ట్)కు నిధులివ్వాలంటూ మెలిక పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'హర్ ఘర్ జల్...' (ఇంటింటికీ తాగునీరు) పథకం కింద అన్ని రాష్ట్రాలకూ నిధులిస్తూ...తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు.రాష్ట్రం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... కిషన్‌రెడ్డి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. దాన్ని సాధిస్తే...ఆయనకు దండేసి దండం పెడతామని ఎద్దేవా చేశారు. పువ్వాడ మాట్లాడుతూ...కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్‌రెడ్డి, రాష్ట్రానికి సంబంధించిన అనేకాంశాల్లో తన నిస్సహాయతను వ్యక్తం చేశారని విమర్శించారు. క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి... ఇప్పుడైనా కనీసం రాష్ట్రానికి మేలు చేకూర్చే చర్యలు చేపట్టాలని కోరారు. కవిత మాట్లాడుతూ... రాష్ట్ర పునర్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సైతం పట్టించుకోకపోతే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆ విషయాలను పట్టించుకోని కిషన్‌రెడ్డి...తన బాధ్యతను మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు.