Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కు పరిశ్రమపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కాలయాపన
- కేంద్రం వైఖరికి నిరసనగా నేడు బయ్యారంలో ఒక్కరోజు నిరసన దీక్ష
- పొల్గొననున్న ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్, ముఖ్య నేతలు
నవతెలంగాణ-బయ్యారం
బయ్యారం ఇనుప ఖనిజం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్‌ను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని అందరూ సంబరపడ్డారు. ఏడేండ్లు గడిచినా.. సర్వేలతో కాలయాపన చేశారే తప్ప ఒక అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు ఏకంగా ఉక్కు పరిశ్రమ స్థాపన సాధ్యం కాదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. దాంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోనూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియనాయక్ ఆధ్వర్యంలో నేడు బయ్యారం మండల కేంద్రంలో ఒక్క రోజు నిరసన ధీక్ష చేపట్టనున్నారు. స్టీల్ఫ్లాంట్ సాధనకు వామపక్షాలు, ప్రజాసంఘాలు తదితరులు అనేక ఉద్యమాలు, ధర్నాలు చేశారు. ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 36గంటల ఉపవాస నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా కేంద్రం ప్రకటనతో మరోసారి దీక్షకు పూనుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్మెన్ ఆంగోతు బిందునాయాక్ దీక్షలో పాల్గొననున్నారు. మంత్రులు పువ్వాడ అజరుకుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు దీక్షకు సంఘీభావంగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బయ్యారం ఉక్కుపరిశ్రమ స్థాపనపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంతో పాటు బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో 5,342 హెక్టార్ల విస్తీర్ణంలో మైనింగ్ ఉన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తించారు. ఇండియన్ మైనింగ్‌శాఖ సమాచారం మేరకు దాని విలువ సుమారు రూ.16లక్షల కోట్లు. 2001లో 63 ఎకరాల నుంచి,2010లోనూ మైనింగ్ చేసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రులతోపాటు ఏపీిఎండీసీఎల్, రక్షణ కంపెనీ సంయుక్తంగా అవకాశం కల్పించింది. కానీ, 2012 తెలంగాణోద్యమ సమయంలో వీటిని రద్దు చేశారు. అయినా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే డిమాండ్‌తో సుదీర్ఘకాలంగా పోరాటాలు జరిగాయి. ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర పునర్విభజన బిల్లులో 6 నెలల్లో ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ (సెయిల్) ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం అయినా జాప్యం నెలకొనడంతో మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
క్వాలిటీ తక్కువంటూ సర్వేలతో కాలయాపన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, రక్షణ స్టీల్స్‌కు పనికొచ్చిన ఖనిజం నేడు సెయిల్‌కు ఎందుకు పనికిరాదని, లాభనష్టాలు, క్వాలిటీ, క్వాంటిటీ గురించి కేంద్ర ప్రభుత్వం సర్వేలతో కాలయాపన చేయడం సరైంది కాదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అయినా బయ్యారం ఖనిజం క్వాలిటీ తక్కువగా ఉందంటూ పరిశ్రమ స్థాపనపై దాటవేసే ధోరణిని కేంద్రం ప్రదర్శిస్తోంది. విభజన అనంతరం బయ్యారంలో మైనింగ్ గుర్తించేందుకు 11 బోర్లు వేసి 320 మిలియన్ టన్నుల ఖనిజ నిక్షేపాలున్నట్టు రాష్ట్ర మైనింగ్ శాఖ తేల్చింది. కానీ, నాణ్యత లేదనే సాకు చూపారు. అయితే స్టీల్ ఫ్లాంట్ పెట్టడానికి ఇది సమస్య కాదని జీఎస్ఐ, సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసిన వారే చెప్పారు. 2015 నవంబర్‌లో ఖనిజ నిక్షేపాలు అన్వేషించే భాధ్యత జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)కు అప్పగించారు. దాంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ..సెయిల్, జీఎస్ఐ, జాతీయ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ వైన్స్ బ్యూరో, రైల్వేలు, సింగరేణి కాలరీస్, పరిశ్రమల యాజమాన్యాలు, ఆర్థిక, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం బయ్యారంలో అవసరమైన మేరకు ఖనిజ నిక్షేపాలున్నట్టు నిర్ణయానికొచ్చారు. ఛత్తీస్‌గడ్‌లోని జగ్దాల్‌పూర్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు పై ఆలోచించాలని నిర్ణయానికొచ్చారు. అయినా అప్పటి నుంచి ఎటువంటి ప్రకటనలు చేయని కేంద్ర ప్రభుత్వం.. పరిశ్రమ నిర్మాణంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆ మరుసటి రోజే అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌ను నియమించారనీ, కేంద్రం ఇప్పటిలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రయివేటుకు అప్పగించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం
సీఎం కేసీఆర్ సైతం సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ పరిశ్రమ పెట్టాలని ప్రధానికి లేఖ రాయడంతోపాటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసినప్పుడు కూడా స్టీల్ పరిశ్రమ పెట్టాలని కోరారు. దాంతో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైనింగ్‌శాఖ వారు సంయుక్త సర్వేకు ఆదేశించి ఐదేండ్లలో జాయింట్ సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.ఒకవేళ బయ్యారం స్టీల్ పరిశ్రమ నిర్మాణానికి సెయిల్ ముందుకు రాకుంటే జిందాల్ కంపెనీకి అవకాశం ఇస్తామని అప్పట్లో సీఎం ప్రకటించారు. పరిశ్రమ కు సరిపడినంత ఖనిజం ఉందా లేదా అని ఐదేండ్లుగా సర్వే చేస్తున్న క్రమంలోనే కరీంనగర్,మెదక్ జిల్లాలో రూ.2500 కోట్లతో స్టీల్ పరిశ్రమ నిర్మాణానికి అస్ట్రేలియా ప్రయివేట్ కంపెనీతో సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణలో రూ.30వేల కోట్లతో పబ్లిక్ రంగ ఉక్కు పరిశ్ర మ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్బంలో తెలంగాణ ఇనుప ఖనిజాన్ని దానికోసం రిజర్వు చేయకుండా విదేశీ ప్రయివేటు కంపెనీకి కేటాయించడం గమనార్హం.
మరోసారి సర్వేతో కాలయాపన
దాంతో మరల 2021 జులై 6వ తేదీన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్, ఫారెస్టు, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా మండలంలోని నామాలపాడు, రాయికుంట సమీపంలో సర్వే నిర్వహించారు. 2 వేల ఎకరాల స్ధలంలో మైనింగ్, ఫారెస్టు, రెవిన్యూ శాఖల అధికారులు మూడురోజులపాటు సర్వే చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన టెక్ డాటం(ప్రయివేటు కంపెనీ) ద్వారా 2వేల ఎకరాల్లో సర్వే నిర్వహించారు. హద్దుల పాయింట్స్ గుర్తించి, పూర్తి నివేదికను తయారు చేయనున్నట్టు తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వాలు సర్వేలతోనే కాలం వెల్లదీస్తున్నాయి. ఇలాంటి సమయంలో బయ్యారం ఉక్కు కార్మాగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండి పోరాడాలని ప్రజలు కోరుతున్నారు.