Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇక 'బంగారు భారతదేశం' చేయాలంటూ సీఎం కేసీఆర్ జోక్ వేశారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. బంగారు తెలంగాణ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బడులు, గుడుల కంటే రాష్ట్రంలో వైన్ షాపులే ఎక్కువని అన్నారు. తాగుబోతులు, అప్పులు, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఉండబోరు, అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని వివరించారు. అందుకే ఇది బంగారు తెలంగాణ కాదనీ, బతుకే లేని తెలంగాణ చేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయ్యిందన్నారు. కమీషన్లు తీసుకుంటూ ఆయన కుటుంబమే బాగుపడిందని చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని అన్నారు.