Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులకు టీఎస్‌టీటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనీ, ఏజెన్సీ ప్రాంతంలోనే వారిని సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్‌టీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీ టీచర్లకు అనుపాత నిష్పత్తి కేటాయింపులో అన్యాయం జరిగిందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటులో సీనియర్లకు అన్యాయం జరిగిందని వివరించారు. స్పౌజ్ కేటగిరీ కేటాయింపుల్లో అవకతవకలు జరగాయని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడు ముంపు మండలాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటాయించిన హిందీ పండితులకు శాశ్వత కేటాయింపులు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మంలో ఎస్టీ టీచర్ల కేటాయింపు దామాషా ప్రకారం జరగలేదని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టుల్లో మహబూబాబాద్ జిల్లాకు 20 కేటాయించినా, ఎస్టీలకు ఒక్కటీ ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. అనుపాత నిష్పత్తి ప్రకారం కనీసం నాలుగు పోస్టులైనా ఎస్టీలకు ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పీల్ చేసుకున్నా ప్రయోజనం లేదని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 మంది సీనియర్ ఎస్జీటీలకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. అధికారుల తప్పిదం వల్ల జూనియర్లకు జిల్లా కేంద్రం చుట్టుపక్కల, సీనియర్లకు మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్‌లు వచ్చాయని వివరించారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలనీ, గిరిజన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.