Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశవ్యాప్త రెండ్రోజుల సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొనాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మార్చి 28,29 తేదీల్లో ఈ సమ్మె జరుగుతుందనీ, జేఏసీలో లేని కార్మిక సంఘాలు కూడా దీనిపట్ల సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారంనాడిక్కడి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్) అధ్యక్షతన సమావేశం జరిగింది. వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్ (టీజేఎమ్‌యూ), కన్వీనర్లు వీఎస్ రావు (ఎస్‌డబ్ల్యూఎఫ్), పి కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు జి అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), ఎస్ సురేష్ (బీడబ్ల్యూయూ) పాల్గొన్నారు. మరో మూడు యూనియన్ల నేతలు జేఏసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలకు, ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్‌కు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. ఈనెల 26న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద జేఏసీ నాయకుల నిరాహారదీక్షను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో డిపోల్లో సేకరించిన సంతకాల పేపర్స్ ఒరిజినల్ కాపీని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు రిజిస్టర్ పోస్టులో పంపాలనీ, రెండు కాపీలను యూనియన్ ఆఫీసులకు పంపాలని కోరారు. ఆ కాపీల ప్రతులను మార్చి 7వ తేదీ లేబర్ కమిషనర్‌కు సమర్పించాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 26న జరిగే దీక్షా శిబిరం వద్ద మార్చి 28, 29 తేదీల్లో జరిగే సమ్మె జయప్రదానికి అవసరమైన కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.