Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలను ప్రకటిస్తూ వచ్చిన సర్కారు అందుకు తగినట్టు ఏర్పాట్లు పూర్తి చేయలేదు. ఇటీవల కొత్తగా ప్రారంభించాలనుకున్న మెడికల్ కాలేజీల తనిఖీ కోసం వచ్చిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, రామగుండం, మహబూబాబాద్,భద్రాద్రి కొత్తగూడెం,సంగారెడ్డి కళాశాలల్లో బోధనా సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించలేదని గుర్తించింది.సదుపాయల కల్పన కూడా పూర్తి చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రకటించిన ఏడు కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ మొదటి సంవ త్సరం తరగతులు ప్రారంభం కాలేదనీ, అందువల్ల అన్ని కళాశాలల్లో బోధనా సిబ్బంని నియామకాలను పూర్తి చేయాలని డీఎంఈని అదేశించింది. దీంతో ఆయా కళాశాలల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశారు. వైద్య కళాశాలల్లో గైనకాలజీ, అనాటమీ, జనరల్ మెడిసిన్, వైరాలజీ తదితర 14 డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో డిపార్ట్ మెంట్ ఏర్పాటుకు 72 బెడ్లతో పాటు ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అవసరం. ఈ విధంగా ప్రతి మెడికల్ కాలేజీలో ఆరుగురు ప్రొఫెసర్లు, 17 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాల్సి ఉన్నది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉండగా, కొత్త కాలేజీలకు కూడా సర్దుబాటు చేయాల్సిన అవసరముంది. పాత, కొత్త మెడికల్ కాలేజీల్లో దాదాపు 2000 మంది బోధనా సిబ్బంది అవసరమని గుర్తించారు. ఖాళీల భర్తీ కోసం ప్రస్తుతం ఇతర విభాగాల్లో పని చేస్తున్న వారిని తీసుకోవడం, ఆ తర్వాత ఇంకా అవసరమైతే నియామకాలను చేపట్టనున్నారు.