Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టం చేయాలని సీఎస్‌కు నోటీసు
- కౌంటర్ వేయండి..లేదంటే కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సఫాయి పనులు చేసే కార్మికులు ఎంతమంది ఉన్నారో, ప్రమాదవశాత్తు మురుగు పనులు చేస్తూ ఎంతమంది మృతి చెందారో పూర్తి వివరాలను నివేదించాలని చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. సఫాయి పనులు చేస్తూ మరణిస్తే వాళ్ల కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత తమది కాదని జలమండలి, జీహెచ్ఎంసీలు చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బాధ్యత తీసుకుని ఎవరు పరిహారం చెల్లించాలో పది రోజుల్లోగా కౌంటర్ పిటిషన్ ద్వారా చెప్పాలని సీఎస్‌ను ఆదేశించింది. లేనిపక్షంలో మార్చి 7న జరిగే విచారణకు స్వయంగా హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొండాపూర్‌లో పనిచేస్తున్న సఫాయి కార్మికులు మరణించడంపై వచ్చిన వార్తలను హైకోర్టు జడ్జి ఉజ్జల్ భూయాన్ చదివి హైకోర్టుకు లెటర్ రాశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మరణించిన వాళ్ల కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లెటర్‌ను హైకోర్టు పిల్‌గా తీసుకుంది. సోమవారం చీఫ్‌జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి బెంచ్ విచారించింది. పది రోజుల్లోగా సీఎస్ కౌంటర్ దాఖలు చేయకపోతే మార్చి 7న జరిగే విచారణకు సీఎస్ స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీసీ కెమెరాల ఏర్పాట్లపై వివరణ ఇవ్వండి : డీజీపీకి ఆదేశం ఓల్డ్ ఏజ్ హౌమ్స్, చైల్డ్ హౌమ్స్, నిరాశ్రయ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాట్ల అంశంపై స్పష్టత ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర, అధికార, అనధికార, లైసెన్స్ అనుమతితో ఉన్నవి, అనుమతులు లేని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని హైదరాబాద్‌కు చెందిన నరసింహాచారి పిల్ వేశారు. డీజీపీ కౌంటర్లో వాటి వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్ల గురించి వివరాలు ల్లేవని హైకోర్టు తప్పుపట్టింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలను నివేదించాలని డీజీపీని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి డివిజన్ బెంచ్ ఆదేశించింది.
మహంతి రిలీవ్‌కు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయండి : హైకోర్టులో కేంద్రం సవాల్
ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ మహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ సర్కార్‌కు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) 2021 జూన్ 16న ఇచ్చిన ఆర్డర్‌ను కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ అశుతోష్ శంకర్ పిటిషన్ వేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బయట ప్రాంతానికి చెందిన అన్ రిజర్వుడు కోటాలోని ఆలిండియా సర్వీసెస్‌కు చెందిన 62 మందిలో మహంతి ఒకరనీ, ఇందులో 27 మందిని తెలంగాణకు కేటాయించామని వివరించారు. రాష్ట్రాల అంగీకారంతోనే కేంద్రం మాత్రమే రిలీవ్ చేయాలనే నిబంధనకు వ్యతిరేకంగా క్యాట్ ఉత్తర్వులున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రిలీవ్ చేసి ఏపీలో పోస్టింగ్ ఇవ్వాలన్న ఉత్తర్వుల్ని కొట్టేయాలని కోరారు.