Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర అనారోగ్యంతో పద్మ కన్నుమూత
- సీఎం, మంత్రులు, తమ్మినేని, చాడ సహా పలువురి సంతాపం
- బాధాకరం : నవతెలంగాణ సంపాదకులు సుధాభాస్కర్
- టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మంగళవారం కన్నుమూశారు. దీర్ఘకాలికంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమె... గత 20 రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించటంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమ్మల సంఘాన్ని స్థాపించిన పద్మ... ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె అంత్యక్రియలను బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పద్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించి, ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పద్మ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆమె మరణం పట్ల సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకరావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్,సత్యవతి రాథోడ్, శాసన మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పద్మకు అరుణోదయ తరపున ఆ సంస్థ గౌరవాధ్యక్షురాలు విమలక్క నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అమ్మల సంఘం అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె మరణం తనను ఎంతో కలిచి వేసిందని పేర్కొన్నారు. పద్మతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్... పద్మ మరణం పట్ల తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అల్లం నారాయణ సతీమణి తీవ్ర అనారోగ్యంతో పోరాడి.. తుది శ్వాస విడిచారని నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ పేర్కొన్నారు. ఆమె మరణం బాధాకరమని ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. నారాయణకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. పద్మ మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) తీవ్ర సంతాపాన్ని ప్రకటించాయి. ఈ మేరకు టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్, కొప్పు నిరంజన్ కూడా సంతాపాన్ని ప్రకటించారు.
పద్మ మరణం పట్ల తెలంగాణ ఫొటో జర్నలిస్ట్సు అసోసియేషన్ (టీపీజేఏ) తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్ హరి ఒక ప్రకటన విడుదల చేశారు. అల్లం నారాయణకు, ఇతర కుటుంబ సభ్యులకు వారు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.