Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకుల విధానాలపై నిర్ద్వంద్వంగా గొంతెత్తాలి
- రూ.600 రోజువారీ కూలి, 200 పనిదినాల కోసం కొట్లాడాలి
- దేశంలో 35 కోట్ల మంది 'ఉపాధి' కూలీలుంటే.. కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లయినా ఇవ్వలే
- రాష్ట్ర బడ్జెట్లోనూ నిధులు పెంచాలి
- వ్యత్యాసం లేని విద్య, వైద్యం కోసం ఉద్యమించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల టౌన్
'ఉపాధి హామీ కోసం పల్లె జనం నుంచి పట్టణ పేదలందరూ నిర్ద్వంద్వంగా గొంతెత్తి డిమాండ్ చేయాలి. రూ.170 కూడా దాటని ఇప్పటి రోజువారీ కూలిని రూ.600కి పెంచాలని, ఏడాదిలో 200రోజులు పని కల్పించాలని గర్జించాలి. దేశంలో 35కోట్ల మంది కూలీలుంటే 39లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం రూ.లక్ష కోట్లైనా ఇవ్వని కేంద్ర సర్కారు సబ్కా సాత్.. సబ్కా వికాస్ చాటున అంబానీ, అదానీల కోసమే పని చేస్తోంది. వ్యత్యాసం లేని విద్య, వైద్య కోసం ఉద్యమిస్తూనే భవిష్యత్ తరాలకు దిక్సూచిగా నిలవాలే..' అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో రాజన్న సిరిసిల్ల కేంద్రంగా మంగళవారం ఉపాధి హామీ కూలీల గర్జన నిర్వహించారు. ప్రధానవక్తగా వచ్చిన నర్సిరెడ్డి కూలీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటికే పట్టణాల సంఖ్య పెరిగి, పెద్దఎత్తున గ్రామాలు విలీనం కావడంతో ఉన్న ఉపాధీ పోయి కనీస ఆదాయాన్నీ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పట్టణ పేదలకు ఉపాధి హామీ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, పట్టణంలో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు రాని పేదలు ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సారంగపాణి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు గుడికందుల సత్యం, గన్నేరువరం నర్సయ్య, నాయిని శారద, బూడిద గణేష్, సీపీఐ(ఎం) సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ సహా పలు సంఘాల నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు