Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని జలసౌద కార్యాలయంలో 'మానేరు రివర్ ఫ్రంట్'పై ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దీని కోసం గతంలోనే రూ. 410 కోట్లు మంజూరయ్యాయనీ, ఇంకా ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన తీగలవంతెన ప్రారంభానికి సిద్దమైందని పేర్కొన్నారు. దాదాపు పది కి.మీటర్లు నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులో మొదటి విడతగా 2.6 కిలోమీటర్ల మేర నిర్మాణాలకు సంబందించిన డీపీఆర్ పనులు పూర్తయి టెండర్లు పిలిచామని వెల్లడించారు. బోటింగ్, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, చిల్డ్రన్ పార్క్స్, కిడ్స్ ప్లే ఏరియాలు, ఆడిటోరియం, మ్యూజియం, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ప్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగ్, టెన్నిస్, వాలిబాల్ కోర్టులు ఉంటాయని వివరించారు.