Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వైఖరి చాలా దారుణం...
- మీడియాతో ఇష్టాగోష్టిలో టీఆర్ఎస్ ఎంపీ నామా ఆవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలకు బీజేపీ వీసమెత్తు విలువనివ్వటం లేదు. కనీసం మా మాటలు పట్టించుకునే వారు లేరు. వినతిపత్రాలు స్వీకరించే పరిస్థితి లేదు... నేను యూపీఏ హయాంలో కూడా ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా పని చేశాను. కానీ ఇప్పటి బీజేపీ కంటే అప్పటి కాంగ్రెస్సే బెటర్. అప్పట్లో అంతో ఇంతో గౌరవం దక్కింది...' అని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తనను కలిసిన విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎంపీల పట్ల బీజేపీ అనుసరిస్తున్న తీరును ఆయన ఈ సందర్భంగా తప్పుబట్టారు. 'యూపీఏ హయాంలో ఓసారి అప్పటి సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి, టీడీపీ ఎంపీ శివప్రసాద్‌కు మధ్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో అంతటి సీనియర్ అయిన ప్రణబ్ ముఖర్జీయే... ఒకడుగు వెనక్కు తగ్గి సారీ చెప్పారు...' అని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడా సామరస్యకపూర్వక ధోరణి, వాతావరణం లేదని అన్నారు. రాష్ట్రానికి చెందిన అనేక హామీలు, నిధుల విషయంలో కేంద్రం మొంచి చేయి చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒకసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గరకు వెళ్లి... తెలంగాణలో రోడ్లు, రహదారుల నిర్మాణం కోసం నిధులు కేటాయించండని అడిగాం. దానికి ఆయన... ప్రధాని తెలంగాణకు ఒక్కపైసా కూడా కేటాయించవద్దని చెప్పారు. అందువల్ల ఆయన్ను కలిసి అభ్యర్థించండి...' అంటూ సమాధానమిచ్చారని నామా తెలిపారు. గతంలో పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి పాత్రికేయులకు అనుమతి ఉండేదనీ, ఇప్పుడు ఆ సాంప్రదాయానికి బీజేపీ తిలోదకాలిచ్చిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి అడగ్గా... 'ఇప్పటి వరకూ జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తే... సమాజ్‌వాదీ పార్టీకే కాస్త మొగ్గు ఉన్నట్టు కనబడుతున్నది.. మిగతా విడతల్లో పోలింగ్ సరళి ఎలా ఉంటుందో చూడాలి...' అని నామా వ్యాఖ్యానించారు.