Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలను ఎమ్మెల్సీ సందర్శించారు. పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు. పలువురు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. నర్సిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ఉపాధ్యాయుల కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడంలో చొరవ తీసుకున్న ఉపాధ్యాయులకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి పాఠశాలలో సర్వీస్ పర్సన్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ప్రతి బడికీ కనీసం ఒక సర్వీస్ పర్సన్ నిర్మించాలన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రత్యేక చొరవతో పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు చాలా బాగున్నాయని, అలాగే నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. 317జీవో వల్ల స్థానికత అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో చాలా మంది టీచర్లు ఇబ్బంది పడుతున్నారని, వారి అర్జీలనన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఉపాధ్యక్షులు జంగిటీ రాజు, కోశాధికారి పర్కాల రవీందర్ కార్యదర్శులు శివ కుమార్, రమేష్, రవి, కాంప్లెక్స్ హెచ్ఎం ఎన్.వి.పరబ్రహ్మ మూర్తి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దేవత ప్రభాకర్, కుమ్మరి మల్లేశం, పాతూరి మహేందర్ రెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు.