Authorization
Tue April 01, 2025 12:00:06 pm
- పిడివాద విధానాలకు వ్యతిరేకంగా న్యూడెమోక్రసీతో తెగదెంపులు
- మారుతున్న పరిస్థితులకనుగుణంగా వ్యూహం ఉండాలి: డివి కృష్ణ, పోటు రంగారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో మరో చీలిక ఏర్పడింది. కొత్తగా సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆవిర్భవించింది. మంగళవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ న్యూడెమోక్రసీ కేంద్రకమిటీ అనుసరిస్తున్న కరుడుగట్టిన పిడివాద విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నామని చెప్పారు. ప్రజల నుంచి పార్టీని దూరంచేసే కాలం తీరిన అతివాద పద్ధతులను మార్చుకునేందుకు ఆ పార్టీ తిరస్కరించిందని వివరించారు. రాష్ట్ర కమిటీకి పోటీగా కమిటీని ఏర్పాటు చేయడం, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు, కుతంత్రాలు చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని, ఉద్యమాన్ని కాపాడుకోవడానికి న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీతో విడిపోవడం అనివార్యమైందని అన్నారు. ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ వంటి ప్రజాసంఘాల్లో మెజార్టీ సభ్యులు తమ నిర్ణయాన్ని బలపరుస్తున్నారని చెప్పారు. 1984లో పార్టీ చీలిపోయినప్పుడు ప్రజాపంథా పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అదే పేరుతో ఇప్పుడు మళ్లీ పార్టీని ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిఘటనా పోరాటం పేరుతో సాయుధ దళాలను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఇది దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు విరుద్ధమనీ, ఇది తమ అనుభవంలో తేలిందని వివరించారు. దళాలు ఎక్కడా లేవనీ, అయినా గుణపాఠం నేర్చుకోవడానికి, పంథాను మార్చుకోవడానికి కేంద్ర కమిటీ సిద్ధంగా లేదన్నారు. నిర్దిష్టకాలంలోగా మహాసభలు నిర్వహించలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం మూడేండ్లకోసారి మహాసభలు జరగాలనీ, 2013తర్వాత జరగలేదని అన్నారు. పార్టీలో అంతరంగిక ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. సామ్రాజ్యవాదానికి లొంగుబా టు ప్రదర్శిస్తున్న స్వతంత్ర దేశంగా భారత్ ఉందన్నారు. బలమైన ఫ్యూడల్ అవశేషాలు కలిగిన పెట్టుబడిదారీ దేశంగా పరిగణిస్తున్నామని వివరించారు.. దేశ, విదేశీ పెట్టుబడిదారులే శత్రువులని చెప్పారు. వారికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటరీ, పార్లమెంటేతర పోరాటాలను జోడించాలని వివరించారు. పార్లమెంటరీ విధానాన్ని, పాలక వర్గాలతో ఫ్రంట్లు కట్టే విధానాన్ని తిరస్కరిస్తున్నామని చెప్పారు.సాయుధ పోరాటం ద్వారానే విముక్తి సాధిస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు, కార్మికులు, రైతులు, మధ్యతరగతి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. మతోన్మాదానికీ, ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పారు. తెలంగాణలో ఏర్పడిన సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథాను భవిష్యత్తులో జాతీయ పార్టీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ 30,40 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూమి జోలికి ఎన్టీఆర్, వైఎస్ వంటి సీఎంలు రాలేదన్నారు. కానీ కేసీఆర్ ఆ భూమిని గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోడు సాగుదార్లకు పట్టాలిచ్చేంత వరకూ పోరాడతామని అన్నారు. ఆ పార్టీ నాయకులు కె రమ, కెజి రాంచందర్ మాట్లాడారు.
14 మందితో రాష్ట్ర కమిటీ
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా 14 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పడింది. కార్యదర్శిగా డివి కృష్ణ, సహాయ కార్యదర్శిగా పోటు రంగారావు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కెచ్చెల రంగయ్య, కె రమ, రాయల చంద్రశేఖర్, పాయం చిన్న చంద్రన్న, జి వెంకటేశ్వరరావు, కె సూర్యం, కెజి రాంచందర్, గుమ్మడి నర్సయ్య, కర్నాటి యాదగిరి, చండ్ర అరుణ, వి కృష్ణ, ఎస్ఎల్ పద్మ ఎన్నికయ్యారు.