Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో అసంతృప్త నేతల భేటీ !
- బండి సంజయ్ తీరుపై సీనియర్ల ఆగ్రహం
- వందమందికిపైగా హాజరు?
- పార్టీకి నష్టం చేస్తే వేటు తప్పదు: బండి సంజయ్
- త్వరలో మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తామన్న అసంతృప్తివాదులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో నెలకొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నది. మొన్నటిదాకా కరీంనగర్ జిల్లా సీనియర్ నేతల్లోనే నెలకొన్న అసంతృప్తి రాష్ట్రమంతటా వ్యాపిస్తున్నది. సీనియర్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు నచ్చకనే వారంతా ఒక్కటవుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రెండుమూడు సార్లు భేటీ అయిన అసంతృప్త నేతలు తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో ఓ రహస్య ప్రదేశంలో సమావేశమైనట్టు సమాచారం. 'భేటీ అయింది వాస్తవమే. ఎక్కడ జరిగింది? ఏం మాట్లాడాం? ఇతర అంతర్గత విషయాలు మీతో చెప్పలేం. సందర్భం వచ్చినప్పుడు మీడియా ముందుకు మేమే వచ్చి చెబుతాం' అంటూ ఆ మీటింగ్‌లో పాల్గొన్న ఒక అంసతృప్త నేత దాటవేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కూడా కూడా స్పందించారు. 'అన్ని పార్టీల్లోనూ నిత్య అసంతృప్తివాదులుంటారు. పార్టీకి నష్టం చేకూర్చే వారు ఎంతటి వారైనా సరే వేటు తప్పదు' అని కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ స్పష్టం చేయడం గమనార్హం. బీజేపీ సీనియర్ నేతలంతా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇతర పార్టీల నుంచి వచ్చి చక్రం తిప్పుతున్న నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. సీనియర్ల అసంతృప్తి పంచాయతీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దాకా చేరింది. ఆ తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకున్నా, సీరియస్ అయినా పంచాయతీ మాత్రం తెగలేదు. అది కాస్తా జఠిలమైంది. బండి సంజరు టార్గెట్‌గా కరీంనగర్లో గతంలో అసంతప్త నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. వారికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు నేతృత్వం వహించారు. సంజయ్ ఒంటెద్దు పోకడలను వారు నిరసించారు. నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌కే సంజయ్ ప్రాధాన్యత ఇస్తూ తమను పట్టించుకోవట్లేదనే అక్రోశంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎ.లక్ష్మినారాయణ, ముగ్గురు, నలుగురు కార్పొరేటర్లు కూడా వారితో జతకట్టారు. పార్టీ పదవిని విడిచిపెట్టనప్పటికీ కొంతకాలంగా అంటీముట్టనట్టు ఉంటున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన సోమారపు సత్యనారాయణ కూడా వారికి తోడయ్యారు. ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, సీనియర్ నేతలు రాజేశ్వర్‌రావు, చింత సాంబమూర్తి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, నిజామాబాద్ , ఆదిలాబాద్ జిల్లాల పలువురు సీనియర్ నాయకులు ఈ అసంతృప్తుల గ్రూపుతో జతకట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు రహస్య సమావేశాలు నిర్వహించిన వీరు పార్టీలో అన్యాయానికి గురవుతున్నవారిని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. దీనిని పసిగట్టిన రాష్ట్ర నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్టీకి నష్టం చేకూరుస్తున్న నేతలపై ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డితో బండి సంజరు గతంలోనే చర్చించారు. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు నేతలపై వేటు వేయాలని అభిప్రాయానికి వచ్చినప్పటికీ పార్టీకి నష్టం చేకూరే ప్రమాదం ఉందనే ఆలోచనతో కొంత వెనుకడుగు వేశారు. మళ్లీ మరోమారు అసంతప్త నేతలు హైదరాబాద్‌లో రహస్యంగా సమావేశం అయ్యారనే విషయం ఆ పార్టీ అగ్రనేతల్ని కలవరపెడుతున్నది. ఓ అసంతృప్త నేతతో నవతెలంగాణ మాట్లాడేందుకు యత్నించగా పూర్తి విషయాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ భేటీలను అగ్రనేతలు తేలికగా కొట్టిపారేస్తున్నప్పటికీ..సమావేశమైన వారిలో మొదటి నుంచీ పార్టీనే అంటిపెట్టుకున్నవారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉండటం బీజేపీని కలవరపెడుతున్నది.