Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యంగా పోరాడితే గెలుపు తథ్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- గ్రామవ్యవస్థకు మూలస్తంభం రెవెన్యూ వ్యవస్థనే : చిన్నారెడ్డి
- ఆంక్షల్ని కాళ్లకింద తొక్కుతూ వచ్చిన వీఆర్ఏలకు అభినందనలు : సీతక్క
- ఇందిరాపార్కు వద్ద తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
- సద్దిమూటలతో తరలివచ్చిన ఉద్యోగులు ఐక్యంగా పోరాడితే గెలుపు తథ్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- గ్రామవ్యవస్థకు మూలస్తంభం రెవెన్యూ వ్యవస్థనే : చిన్నారెడ్డి
- ఆంక్షల్ని కాళ్లకింద తొక్కుతూ వచ్చిన వీఆర్ఏలకు అభినందనలు : సీతక్క
- ఇందిరాపార్కు వద్ద తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
- సద్దిమూటలతో తరలివచ్చిన ఉద్యోగులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేస్కేలు, పర్మినెంట్, పదోన్నతులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, తదితర డిమాండ్ల కోసం వీఆర్ఏలు చేస్తున్న పోరాటం ధర్మయుద్ధమనీ, ఐక్యంగా పోరాడితే గెలుపు తథ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నొక్కి చెప్పారు. ఈ మహాధర్నాతోనే సరిపెట్టుకుని అంతా అయిపోయిందనుకుంటే ప్రయోజనం ఉండదన్నారు. ఎండకు ఎండినా..వానకు తడిసినా..చలికి వణికినా మూడు వ్యవసాయ నల్లచట్టాల రద్దు కోసం రైతులంతా ఏడాదిపాటు ఢిల్లీలో పోరాటం చేసి విజయం సాధించారని చెప్పారు. జగమొండి అయిన నరేంద్రమోడీతో క్షమాపణలు చెప్పించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆ పోరాట స్ఫూర్తితో వీఆర్లంతా ముందుకు సాగాలనీ, వారికి అండగా సీపీఐ(ఎం) అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ గ్రామసేవకుల సంఘం, తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ సేవకుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఐక్యకార్యాచరణ కమిటీ అధ్యక్షులు బాలనర్సయ్య, ప్రధాన కార్యదర్శులు బాపూదేవ్, వంగూరు రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది వీఆర్ఏలు సద్దిమూటలు పట్టుకుని తరలొచ్చారు. 'వీ వాంట్ జస్టిస్...వీ వాంట్ జస్టిస్...పేస్కేలు వర్తింపజేయాలి...పర్మినెంట్ చేయాలి...వీఆర్ఏల ఐక్యత వర్థిల్లాలి..' అంటూ పెద్దఎత్తున నినదించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ..హైదరాబాద్‌కు ప్రభంజనంగా తరలొచ్చిన వీఆర్ఏల ఆక్రందన, ఆవేదనలను సీఎం కేసీఆర్ దృష్టికి పోలీసులు తీసుకెళ్లాలని కోరారు. ఇటీవల కాలంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన పెద్ద పోరాటం ఇదేనని చెప్పారు. పేదవాడి ఆక్రందనను రాష్ట్ర సర్కారు పట్టించుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో వీఆర్ఏలది కీలక పాత్ర అనే విషయాన్ని సీఎం కేసీఆర్ గ్రహించాలన్నారు. రూ.10, 500 వేతనం ఇవ్వడమంటే సిగ్గుచేటనీ, దాంతో నెలంతా ఎట్టా బతుకుతారని ప్రశ్నించారు. మూడు ముద్దలకు కూడా సరిపోని వేతనం గౌరవ వేతనం ఎలా అవుతుంది? అవమానించడం కాదా? అని నిలదీశారు. వీఆర్ఏలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదీ, రాజ్యాంగబద్ధమైనదీ అన్నారు. కేసీఆర్ మాయల మరాఠీ అనీ, ఆయన తియ్యటి మాటలు చెబుతాడుగానీ ఆచరణలో చేసేందేమీ ఉండదని చెప్పారు. వీఆర్ఏలకు పేస్కేలిచ్చి పర్మినెంట్ చేయకపోతే భరతం పడతామని హెచ్చరించారు. చట్టబద్ధంగా కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలనే సోయిని మరిచిందని విమర్శించారు. కనీస వేతనాలను కేసీఆర్ ప్రభుత్వం ఒక్కసారిగా కూడా పెంచలేదన్నారు. సంబంధిత జీవో కోసం ఇటీవల పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయని చెప్పారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..రాష్ట్ర సర్కారు ఆంక్షల్ని కాళ్ల కింద తొక్కుతూ మహాధర్నాకు వచ్చిన వీఆర్ఏలకు అభినందనలు తెలిపారు. ధర్నాలుచేయొద్దు..దీక్షలు చేయొద్దు అని నిరంకుశత్వానికి పోయిన టీఆర్ఎస్పై న్యాయ పోరాటం చేసి ధర్నాచౌక్ విషయంలో గెలుపొందామన్నారు. వీఆర్ఏలు, వీఆర్ఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లలో ఎక్కువ ఉన్నది దళిత, గిరిజన, వెనుకబడిన సామాజిక తరగతుల వారేననన్నారు. అందుకే వారిపై రాష్ట్ర సర్కారు కక్షగట్టి ముందుకు పోతున్నదని విమర్శించారు. మోసం చేయడంలో, మాయమాటలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు ఎవ్వరూ లేరని విమర్శించారు. వీఆర్ఏ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీనిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వీఆర్ఏల సంఘం పూర్వ గౌరవాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..వీఆర్ఏలు గ్రామ పోలీసులన్నారు. గ్రామ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పైకి చేరవేడయంలో వారిదే కీలకపాత్ర అన్నారు. అలాంటి వారికి రూ.10,500 ఇచ్చి వెట్టిచాకిరీ చేయించడం దారుణమని విమర్శించారు. కష్టపడి పనిచేసేటోళ్లకు వేతనాలు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. 23 వేలమంది వీఆర్ఏల సమస్యలను పరిష్కరించకపోతే వారి పోరాటానికి 23 లక్షల కుటుంబాలు మద్దతు తెలుపుతాయనీ, అది రాష్ట్ర సర్కారుకే నష్టదాయకమని హెచ్చరించారు.
రెవెన్యూశాఖ మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయ పుట్టిన నాటి నుంచి రెవెన్యూ వ్యవస్థ ఉందన్నారు. మెఘలాయుల నుంచి నేటి వరకూ రెవెన్యూ వ్యవస్థ పరిణామ క్రమాన్ని వివరించారు. పాలనాపరంగా కీలకమైన రెవెన్యూ వ్యవస్థను రాష్ట్ర సర్కారు కావాలనే నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. రెవెన్యూశాఖకు మంత్రి, సీసీఎల్ఏ, ప్రధాన కార్యదర్శి లేకపోవడం దారుణమన్నారు. వీఆర్ఏల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని హామీనిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..అమ్మా..అయ్యా అని వేడుకుంటే సమస్యలను పరిష్కరించే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్నారు. పోరాటాలే మార్గమని నొక్కి చెప్పారు. మార్చి నెల నుంచి వీఆర్ఏలకు పీఆర్సీ ఇవ్వాలనీ, వారి డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండు సంఘాలుగాదు..మిగతా రెవెన్యూ సంఘాలన్నీ ఐక్యంగా ఒకే తాటిపైకి వచ్చి తమ పోరాటాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రధాని అయితే తమకేం అభ్యంతరం లేదుగానీ..ముందు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు బాగుంటేనే గ్రామాలు పచ్చగా ఉంటాయన్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన రెవెన్యూ శాఖ కేసీఆర్ హయాంలో వెలవెలబోతున్నదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకున్నందుకే విజయవాడ భగ్గుమన్న విషయం సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎమ్మార్వోలపై పెట్రోల్ పోసిన చరిత్ర తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. నిరుద్యోగులే కాదు.. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పటం లేదని వివరించారు.2017లో శివరాత్రి రోజున వీఆర్ఏలకు సీఎం ఇవ్చిన హామీని నెలబెట్టుకోవాలని సూచించారు.
వీఆర్ఏ సంఘాల జేఏసీ నేతలు వంగూరు రాములు, బాపూదేవ్ మాట్లాడుతూ..బెదిరింపులకు భయపడబోమనీ, హక్కుల కోసం పోరాడుతామని నొక్కి చెప్పారు. అసెంబ్లీ, ప్రగతిభవన్సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలనువెంటనే నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇసుక డ్యూటీలతో వీఆర్ఏలకు సంబంధంలేదన్నారు. వారి ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేననన్నారు. త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, బీఎస్పీ ఉపాధ్యక్షులు దయానంద్, ఎమ్మార్పీఎస్ నేత కిరణ్‌మాదిగ, బీజేపీ నేత తీన్మార్ మల్లన్న, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, అసోసియేట్ అధ్యక్షులు నాగేశ్వర్రావు, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి నాగన్నగౌడ్, హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ వీఆర్ఏ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బాలమణి, జేఏసీ నాయకులు కె.రాజు, చల్లా లింగరాజు, శ్రీధర్‌గౌడ్, దాదేమియా, నరసింహారావు, ఎస్.రామయ్య, లక్ష్మి, రమాదేవి, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.