Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో నిరుద్యోగం ఏడు శాతం
- నగరంలో 10.2 శాతం
- ఖాళీలున్నా... నోటిఫికేషన్లు సున్నా
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకేతీరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరుద్యోగులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉపాధి అవకాశాల్లేకుండా పంజా విసిరింది. ఉద్యోగాలున్న వారు సైతం ఉపాధి కోల్పోయేలా చేసింది. కరోనా దెబ్బకు పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనపై శీతకన్ను ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్నా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. దీంతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ తీరు పట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు కరోనా, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నిరుద్యోగం రేటు పెరుగుతున్నది. నిరుద్యోగం రేటు ఎక్కువున్న ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ఏడు శాతం నమోదైంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్ఎఫ్) సర్వే వివరాలను ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 3.9 శాతం, పట్టణాల్లో 6.9 శాతం నిరుద్యోగం రేటు ఉన్నది. జాతీయ స్థాయిలో 15 ఏండ్లు పైబడిన వారిలో నిరుద్యోగం మొత్తం 4.8 శాతం నమోదైంది. ఇక తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 5.2 శాతం, నగరంలో 10.2 శాతం నిరుద్యోగం రేటు ఉన్నది. రాష్ట్రంలో 15 ఏండ్లకు పైబడిన వారిలో నిరుద్యోగం ఏడు శాతం నమోదైంది. కేరళలో పది శాతం, ఢిల్లీలో 8.6 శాతం, అస్సాంలో 7.9 శాతం, పంజాబ్లో 7.3 శాతం, ఉత్తరాఖండ్లో 7.1 శాతం ఉన్నది. తెలంగాణ పక్కనున్న ఏపీలో 4.7 శాతం నిరుద్యోగం రేటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగం ఎక్కువుండడం గమనార్హం.
కేంద్రంలో 8.72 లక్షల ఖాళీలు
కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రంలో మంజూరైన మొత్తం పోస్టులు 40,04,941 ఉన్నాయి. అందులో ప్రస్తుతం 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. 2016-17 నుంచి 2020-21 వరకు యూపీఎస్సీ 25,267 పోస్టులు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 2,14,601 పోస్టులు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2,04,945 పోస్టులు కలిపి మొత్తం 4,44,813 పోస్టులు భర్తీ అయ్యాయని వివరించారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో కలిపి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోడీ వాగ్దానం నీటి మూటలుగానే మిగిలాయి. ఉద్యోగాల కల్పన కోసం బీజేపీ సర్కారు ఏమాత్రం చిత్తశుద్ధిని కనబరచకపోవడం గమనార్హం. ఎంప్లారుమెంట్ ఎక్స్ఛేంజీల్లో పట్టభద్రులు తమ పేర్లను నమోదు చేసుకోవడం తప్పనిసరి కాదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి రామేశ్వర్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. చదువు పూర్తయిన తర్వాత పేర్లను నమోదు చేసుకోవడం స్వతంత్రంగానే జరుగుతుందని వివరించారు.
కొలువుల్లేవు...
నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఎన్నికల సమయంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హడావుడిగా ప్రకటనలు ఇస్తుంది. ఆ తర్వాత మరిచిపోవడం షరామామూలుగా జరుగుతున్నది. రాష్ట్రంలో కొలువుల ఊసేలేదు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన పోస్టులు 4,91,304 ఉన్నాయి. అన్ని శాఖల్లోనూ కలిపి 3,00,178 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికలో సీఆర్ బిశ్వాల్ కమిటీ ప్రకటించింది. వాటి భర్తీకి నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు.