Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య, పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీకర్ కె రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మార్చి చివరి నాటికి 400 బిలియన్ డాలర్ల ఎగుమతులే భారత్ లక్ష్యమని వాణిజ్య, పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీకర్ కె రెడ్డి అన్నారు. ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా)పై బుధవారం హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌కు యూఏఈ మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని చెప్పారు. ఇరు దేశాల మధ్య 2019-20లో 59 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని వివరించారు. భారత్‌లో పెట్టిన ఎఫ్‌డీఐల్లో యూఏఈ భాగస్వామ్యం 11.38 బిలియన్ డాలర్లు ఉందన్నారు. ఇతర రంగాల్లో 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని అన్నారు. గతేడాది యూఏఈకి 2932 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేశామనీ, యూఏఈ నుంచి 6,086 మిలియన్ డాలర్ల దిగుమతులు వచ్చాయని వివరించారు. ఈ ఒప్పందంలో అన్ని రంగాల వ్యాపారాభివృద్ధికి సంబంధించి ప్రణాళికలున్నాయని అన్నారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రత్నాలు, ఆభరణాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, వైద్య పరికరాలు, మందులు, ఆటోమొబైల్ వంటి రంగాల్లో యూఏఈతో విస్తృత వ్యాపార భాగస్వామ్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విదేశీ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జి సీతారాం రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ డి కృష్ణభాస్కర్, ఎఫ్‌టీసీసీఐ ఉపాధ్యక్షులు అనిల్ అగర్వాల్, మీలా జయదేవ్, సీఈవో ఖ్యాతి నరవానే తదితరులు పాల్గొన్నారు.