Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రాష్ట్రాల్లోనూ ఓపీఎస్ పునరుద్ధరించాలి
- ఎన్ఎంఓపీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రాజస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు రాజస్థాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించడం హర్షణీయమని ఎన్ఎంఓపీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ, సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 84 లక్షల రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 నుంచి సీపీఎస్ విధానాన్ని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సత్వరమే పాత పింఛన్ విధానంపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు దాసోహం అవుతున్న ఉద్యోగుల భవిష్యనిధి పెట్టుబడులు ఆర్థిక, సామాజిక భద్రత చేకూర్చాలని సూచించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దు దిశగా అడుగులు వేయాలని కోరారు.
స్వాగతించిన సీపీఎస్‌టీఈఏ
రాజస్థాన్‌లో సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయడం పట్ల సీపీఎస్‌టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్ స్వాగతించారు. రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. తద్వారా ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపించుకోవాలని సూచించారు.