Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎస్, ఐపీఎస్‌లకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఏపీ, తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆర్డర్లను కొట్టేయాలంటూ కేంద్రం వేసిన రిట్లపై విచారణను హైకోర్టు మార్చి 24కి వాయిదా వేసింది. ఈలోగా కేంద్రం వేసిన అన్ని కేసుల్లోనూ ప్రతివాదులుగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర్‌రెడ్డితో కూడిన బెంచ్ బుధవారం ఆదేశాలిచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ మహంతిని ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసి... తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాలనే ఆదేశాలను అమలు చేయకపోవడంపై క్యాట్‌లో దాఖలైన కోర్టు ధిక్కార కేసును తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో క్యాట్ కోర్టు ధిక్కార ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోరితే అందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈ కేసును కోర్టు విచారణ చేయబోతుంటే ఇతర కేసులన్నీ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ వద్ద ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ కేసును కూడా ఉజ్జల్ భూయాన్ బెంచే విచారించింది. కోర్టు ధిక్కార కేసు గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావిస్తే అందులో జోక్యం చేసుకోలేమంటూ బెంచ్ నిరాకరించింది. తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్... పలువురు ఐఏఎస్‌లు, పలువురు ఐపీఎస్‌లను ఏపీకి కేటాయిస్తే వారు క్యాట్ ఆర్డర్‌తో తెలంగాణలో కొనసాగుతున్నారు. శ్రీలక్ష్మి, ఇతర ఐఏఎస్‌లను తెలంగాణకు కేటాయిస్తే వాళ్లంతా క్యాట్ ఆదేశాలతో ఏపీలో కొనసాగుతున్నారు. ఈ కేసులన్నింటిలో క్యాట్ ఆదేశాల్ని కొట్టేయాలని, కేంద్ర సర్వీస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే జరుగుతాయని కేంద్రం వాదించింది. ఈ క్రమంలో అన్ని కేసుల విచారణను హైకోర్టు మార్చి 24కి వాయిదా వేసింది.