Authorization
Tue April 01, 2025 06:54:13 pm
- ప్రమోషన్లులేవు..డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వలేదు
- పర్మినెంట్ ప్రస్తావన జాడే లేదు
- నేడు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలతో వీఆర్ఏల నిరసనలు : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రమోషన్లు కల్పిస్తాం..సొంతూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం...ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి ప్రతినెలా ఒకటోతేదీనే వేతనాలిస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చి ఈ నెల 24కి సరిగ్గా ఐదేండ్లవుతున్నదనీ, వాటిలో నేటికీ ఒక్కహామీ నెరవేరలేదని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాల (విఆర్ఏ) ఐక్య కార్యాచరణ కమిటీ పేర్కొంది. రాష్ట్ర సర్కారు తీరును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టాలని వీఆర్ఏలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, తెలంగాణ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.బాపుదేవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీఆర్ఏలలో ఎక్కువ దళిత, గిరిజన, ఇతర సామాజిక తరగతుల వారే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా వారికిచ్చిన పేస్కేలు, వారసులకు ఉద్యోగాల హామీని వెంటనే నెరవేర్చాలని సీఎం కేసీఆర్ను కోరారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు తరలొచ్చిన వేలాది మంది వీఆర్ఏలకు ధన్యవాదాలు తెలిపారు. పే-స్కేల్, వారసులకు ఉద్యోగాలు, అర్హత కల్గిన వారికి ప్రమోషన్లు, తదితర పెండింగ్ సమస్యలపై జీవోలు ఇచ్చి అమలు చేయించాలని కోరుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వీఆర్ఏలంతా వినతిపత్రాలివ్వాలని పిలుపునిచ్చారు. అప్పటికీ జీఓలు విడుదల చేయకుంటే వీఆర్ఏలంతా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని రాష్ట్ర సర్కారును వారు హెచ్చరించారు.