Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనీ, తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌పై ఈనెల 25న టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్టు తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీవైఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. పూటకో ప్రకటన చేస్తూ త్వరలో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని తెలిపారు. మూడేండ్లు గడుస్తున్నా నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. గ్రూప్-1, 2 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఇవ్వాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కృష్ణనాయక్, సిల్వేరు రాజు, రాథోడ్ సంతోష్, శ్రీను, జె రమేష్ తదితరులు పాల్గొన్నారు.