Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-డిచ్పల్లి
విద్యార్థుల ఫెలోషిప్లపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ చేపట్టి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగేష్ మాట్లాడుతూ.. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన యూజీసీ ఫెలోషిప్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫెలోషిప్లపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదన్నారు. అదేవిధంగా 2017లో 554గా ఉన్న పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లను 2021లో 332కు కుదించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు పెద్ద పీట వేస్తామని చెప్పి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లను తగ్గించడం అవమానకరమని అన్నారు. ఎన్నికల సమయంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీపై కేంద్ర ప్రభుత్వం పెదవి విప్పడం లేదని విమర్శించారు.
వెంటనే యూజీసీ ఫెలోషిప్లను పెంచాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి కోమిరే శ్రీశైలం, ఉపాధ్యక్షులు రాహుల్, ముస్తఫా, శేషు, వంశీ, నాయకులు రమ్య, రజిత, గీతా, సాయి, పవన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.