Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 జిల్లాల్లోని పాఠశాలల అప్పగింత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖలో కదలిక ప్రారంభమైంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో సర్కారు మన ఊరు- మన బడి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈమేరకు తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 స్కూళ్లను ఎంపిక చేసింది. అదనపు తరగతి గదులు, మరమ్మత్తులు, అవసరమైన ఫర్నీచర్, టాయిలెట్లతోపాటు డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.7289.54 కోట్లను కేటాయించింది. తొలి దఫాలో రూ.3497.62 ఖర్చు చేయనుంది. ఈమేరకు రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని 28 మండలాల్లో ఉన్న పాఠశాలలను సాగునీటి శాఖకు అప్పగించింది. భద్రాది-కొత్తగూడెం జిల్లాలో ఆరు, జనగామలో రెండు, మహబూబ్‌నగర్‌లో రెండు, మంచిర్యాలలో రెండు, మెదక్‌లో ఐదు, మేడ్చల్‌లో ఒకటి, పెద్దపల్లిలో రెండు, రాజన్న -సిరిసిల్లలో నాలుగు, వికారాబాద్‌లో రెండు, వరంగల్‌లో రెండు చొప్పున పాఠశాలలను అప్పగిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా సాగునీటి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈమేరకు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ లక్ష్యాల మేరకు మన ఊరు
- మన బడి పథకాన్ని అమలుచేసేందుకు సాగునీటి శాఖ సమాయత్తమవుతున్నది. గురువారం రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ(టీఎస్ఐఆర్డి)లో ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్ సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్‌ను ఆదేశించారు.