Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రుల కంటితుడుపు పర్యటన
- నష్టపరిహారం ఇవ్వాల్సిందే..: ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- 25న దేశవ్యాప్త నిరసనలు : టి. సాగర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో అతివృష్టి, అనావృష్టితో రూ.35 వేల కోట్ల పంట నష్టం జరిగిందని, ఇటీవల వరంగల్‌లో సీఎం తన పర్యటనను రద్దు చేసుకొని మంత్రులను పంపినా, వారెవరూ నష్టపరిహారంపై హామీ నివ్వకపోవడం శోచనీయమని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం హన్మకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశం హన్మకొండలోని సంఘం కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. 14, 15వ ఫైనాన్స్‌కు సంబంధించిన రూ.3,200 కోట్లు తప్పా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా బడ్జెట్లో పెంచలేదన్నారు. ఏటా వరంగల్ జిల్లాలో రాళ్ల వానతో రూ.1,200 కోట్ల మేరకు పంట నష్టం జరుగుతుందని తెలిపారు. సీఎం తన పర్యటనను రద్దు చేసుకొని ముగ్గురు మంత్రులను వరంగల్‌లో పంట నష్టం పరిశీలనకు పంపినా.. వారెవరూ నష్టపరిహారంపై స్పష్టమైన హామినివ్వలేదన్నారు. అంతేకాదు, ఇప్పటివరకు పంట నష్టాలపై రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులూ సమగ్ర సర్వేనూ చేయలేదన్నారు. సీఎం మంత్రులను పంపడమే తప్ప.. నేటికీ ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 2021-22లో రూ.599 కోట్లు కేటాయించారని, ఇందులో కనీసం రూ.200 కోట్లు వరంగల్ బాధిత రైతులకు ఇవ్వాల్సి ఉండేనని తెలిపారు. పత్తి రైతులు గులాబీ పురుగుతో, మిర్చి రైతులు నల్లతామర పురుగుతో తీవ్రంగా నష్టపోయారన్నారు. చీడ, పీడలతో తీవ్రంగా నష్టపోవడం కూడా ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోవడమేనని స్పష్టం చేశారు. అనంతరం సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ.. రోజు కూలీ రూ.600 ఉండాలని, ప్రతి కుటుంబానికి 200 రోజుల పనిని కల్పించాలని ఇందుకు 500 సంఘాలు ఈనెల 25న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని, ఈ కార్యక్రమాన్ని రైతులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకున్న నేపథ్యంలో రైతులు బడ్జెట్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారని, ఆత్మహత్యల నివారణకు బడ్జెట్లో ఒక విధానం తీసుకుంటారని ఆశించినా కేంద్రం అలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమన్నారు. సమావేశంలో రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డి, గొడుగు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు కె. నారాయణరెడ్డి, నవరత్న, జి. బాబురావు, బి. సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.