Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల సమన్వయకమిటీ పిలుపు
- పోస్టర్‌ను ఆవిష్కరించిన నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ పేదలను పూర్తిగా విస్మరించిందని ప్రజా సంఘాల సమన్వయ కమిటీ విమర్శించింది. కార్మికులు, రైతులు, కూలీలు, పేద, మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాసంక్షేమ రంగానికి నిధులు కేటాయించకుండా పూర్తిగా కోతలు పెట్టిందని పేర్కొంది. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల రక్షణ కోసం రాయితీలు ప్రకటించిందనీ, ప్రాధాన్యతా రంగాలను పట్టించుకోలేదని తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రజాసంఘాల సమన్వయ కమిటీ నాయకులు బి వెంకట్, ఎం సాయిబాబు, టి సాగర్ అంతకు ముందు 25న జరిగే నిరసనలకు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. తర్వాత వారు విలేకర్లతో మాట్లాడారు.
దేశాన్ని అమ్మేందుకే బడ్జెట్ : బి వెంకట్
దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు వీలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌ను రూపొందించిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ విమర్శించారు. ఉపాధి కూలీలకు, అంగన్వాడీలకు, ఆహార భద్రత, ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెట్‌ను భారీగా తగ్గించిందన్నారు. ప్రజలంటే, అదానీ, అంబానీ, బహుళ జాతి కంపెనీలే అన్నట్టు బీజేపీ భావిస్తున్నదని విమర్శించారు. అందుకే వారికి భారీగా పన్నులు తగ్గించిందని చెప్పారు. రూ 12 లక్షల కోట్ల విలువైన దేశ సంపదను వారికి కట్టబెట్టేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు వీలుగా వాటికి ఆదాయాన్ని తగ్గించిందన్నారు. దీంతో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉపాధి, ఇండ్లు, సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. రూ 40 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ అది దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించలేదనీ, అందుకే తాము ఆ బడ్జెట్‌కు నిరసనగా ఆందోళనలు చేపడుతున్నట్టు వివరించారు.
సంపన్నులకు రాయితీలు, సంక్షేమానికి కోతలా? : ఎం సాయిబాబు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సంపన్నులకు పుష్కలంగా రాయితీలు కల్పించి, ప్రజా సంక్షేమ నిధుల్లో కోత పెట్టిందని సీఐటీయు అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు విమర్శించారు. అందుకే ఈ బడ్జెట్ రైతులు, కార్మికులు, పేదలకు వ్యతిరేకమైందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. బడా కార్పొరేట్ల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేలా బడ్జెట్ ఉందన్నారు. ఇప్పటికే వారి వద్ద సంపద పొగవుతున్నదని చెప్పారు. మరోవైపు దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగితున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నులు వేసి, కార్పొరేట్లకు వరాలు ఇచ్చిందని విమర్శించారు. దేశ రక్షణ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్త్నుదని విమర్శించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలను తిప్పకొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
రైతుకు రుణ విముక్తి కలిగించరా? టి సాగర్
దేశంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ రైతుకు రుణ విముక్తి కలిగించలేదని తెలిపారు. ఆత్మహత్యల నివారణ కోసం రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర బడ్జెట్ విస్మరించిందని తెలిపారు. పెరుగుతున్న ఎరువుల ధరలను తట్టుకోలేకపోతున్న అన్నదాతలకు ఇచ్చే ఎరువులపై సబ్సిడీ తగ్గించడంతో మరింత భారం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్న ఉపాధి చట్టానికి నిధులు తగ్గించి, వారి పొట్టకొట్టిందని చెప్పారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు, రూ 600 కూలీ ఇచ్చేదాక పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్, పీఎన్ఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి భాస్కర్, నాయకులు యాదగిరి, అవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్‌ఖాన్ (పాషా) మాట్లాడారు.