Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక శక్తుల ఐక్యత అవసరం : సీపీఐ(ఎం) రాష్ట్ర కారదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-జనగామ
దేశంలో బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని, లౌకిక శక్తులను ఐక్యం చేస్తూ బీజేపీపై పోరాడుతామన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల సందర్బంగా బీజేపీ అగ్రనాయకత్వం ఓడిపోతామనే భయంతో ప్రజలను భయంభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. హైదరాబాద్లో ఈ నెల 15న ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్లో రెండోదశ ఎన్నికల పోలింగ్ ముగిసిందనీ, ఇంకా ఐదు దశలున్నాయనీ, ఇప్పటికే జేసీబీలు, బుల్డోజర్లు తెప్పించామనీ, ఎవరైనా యోగికి వ్యతిరేకంగా ఓటేస్తే వాటితో తొక్కిస్తామని, లేదంటే.. రాష్ట్రం విడిచి వెళ్లిపోవాల్సిందేనని బాహటంగా బెదిరిస్తూ మాట్లాడటం చట్టవిరుద్ధమన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు వెంటనే స్పందించాలని కోరారు. న్యాయస్థానాలు, ఎన్నికల కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకుని కఠినచర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్నాటకలోని శివమొగ్గలో హర్ష అనే వ్యక్తిని ముస్లింలే చంపారని, హిందూమతం కోసం చనిపోయిన గొప్పవీరునిగా కాషాయ మూకలు, ఆరెస్సెస్ శక్తులు చిత్రించి మతఘర్షణలు సృష్టిస్తున్నదన్నారు. దేశంలో లౌకిక శక్తులను కాపాడాలని, వాటి ఐక్యత కోసం సీపీఐ(ఎం)గా ముందుకెళ్తామని తెలిపారు. బీజేపీ ప్రజావ్యతిరేక పరిపాలనను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శిస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్రాల హక్కుల సాధనకు అన్ని రాష్ట్రాలను కలుపుకుని పోరాడాలని నిర్ణయించడం శుభపరిణామన్నారు. కానీ, ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు ఇప్పుడు సరైంది కాదని, గతంలో ఇలాంటి ఫ్రంట్ల ద్వారా ఒరిగిందేమీలేదని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి ఇంకా తేలలేదని, దళితబంధు ఎన్నికల స్టంటుగానే ఉందని ఆరోపించారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో పోడు భూములపై ఇచ్చిన దరఖాస్తులు పరిశీలించి సమస్య పరిష్కారమయ్యే వరకు వారి జోలికి రామని ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. భూముల చుట్టూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు కంచెలు, కందకాలు చేయడంతోపాటు భూములను ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం స్పందించట్లేదన్నారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు విషయంలో ప్రజా వ్యతిరేకతను గమనించి దొడ్డిదారిన కరెంట్ బిల్లులపై భారాలు మోపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో విద్యుత్ పోరాటం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని, వీఆర్ఏ, వీఆర్ఓ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమన్న, గొల్లపల్లి బాపురెడ్డి, సింగారపు రమేష్, బోట్ల శేఖర్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.