Authorization
Fri March 28, 2025 04:22:24 pm
- ఉక్కు పరిశ్రమ సాధించే వరకూ ఉద్యమం
- విభజన హామీలు అమలు చేయకుంటే.. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
- పరిశ్రమ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం
- కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలి:మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- బయ్యారంలో ఒక్కరోజు దీక్ష
నవతెలంగాణ-బయ్యారం
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేంతవరకూ పోరాటం ఆగదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా జెడ్పీ చైర్మెన్ బిందునాయక్తో కలిసి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్ని మాట్లాడారు. బీజేపీ ఎంపీలకు సిగ్గు ఉంటే వెంటనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యతమైనదన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం ఇప్పటికే మూడుసార్లు ఢిల్లీలో విన్నపాలు ఇచ్చామనీ, ఇక అవసరమైతే ఢిల్లీలోనే ధర్నా చేపడతామని తెలిపారు. విభజన హామీలు బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీలో ఏ ఒక్కటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. ఉన్న ప్రభుత్వ సంస్థలనే అమ్మి కేంద్రమంతటా ప్రయివేటీకరణ వ్యవస్థ తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ తీవ్రంగా నష్టపరచాలని కేంద్రం చూస్తోందన్నారు. ప్రజలు చైతన్యవంతమై కేంద్రాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 17 మెడికల్ కాలేజీలకు ప్రపోజల్స్ పంపిస్తే, ఆంధ్రాకు 15 మెడికల్ కాలేజీలు కేటాయించిన కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకపోవడంపై ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అనంతరం మాలోత్ కవిత మాట్లాడుతూ.. కర్మాగారం కోసం ప్రయత్నించకుండా ఫ్యాక్టరీ రాదని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పడం దారుణమన్నారు. కాగా ఎమ్మెల్యే హరిప్రియకు నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షకు ప్రజా సంఘాల నాయకులు, కుల, ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రెడ్యా నాయక్, శంకర్‌నాయక్, రాములునాయక్, ఎమ్మెల్సీలు తక్కళ్ళపల్లి రవీందర్ రావు, తాతా మధు, జెడ్పీ చైర్మెన్లు ఆంగోత్ బిందునాయక్, కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోతు హరిసింగ్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్లు దిండిగాల రాజేందర్, గుడిపూడి నవీన్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం, మండల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.