Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు లైంగిక దాడి చేశారని సూసైడ్ నోట్
- మహబూబాబాద్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. తనపై నలుగురు అత్యాచారయత్నం చేశారని దాంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికినట్టు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్రపవర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి ఈనెల 16న అదే గ్రామంలోని తన స్నేహితురాలి ఇంటికి పడుకోవడానికి వెళ్లి 17 ఉదయం వచ్చింది. మళ్లీ 17వ తేదీన పడుకోవడానికని వెళ్లి 18న తెల్లవారుజామున ఇంటికి వచ్చింది. వచ్చిన వెంటనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన ఆమె కుటుంబసభ్యులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందింది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడి చేశారని దాంతో మనస్తాపంతో చనిపోతున్నట్టు ఆమె లేఖ రాసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామనీ, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. విచారణ జరుపుతున్నామని, త్వరలో పూర్తి వివరాలు అందజేస్తామని చెప్పారు. ఆలేరు గ్రామంలో ఇంటర్ వరకు విద్యనభ్యసించి క్రీడల్లో రాణిస్తున్న ఒక యువతి పై నలుగురు లైంగిక దాడి చేశారని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందన్న ఘటనతో పాటు ఆమె రాసిన సూసైడ్ నోట్.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి భర్త, ఒక పోలీసు ఉద్యోగి, ఒక ఆటో డ్రైవర్, పూల వ్యాపారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు నోట్లో ఉన్నట్టు సమాచారం.