Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషలిస్టు దేశాల్లో మెరుగైన సౌకర్యాలు: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
- ప్రభుత్వ ఆస్పత్రులే సేవలందించారు: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో నిజమైన భగీరథులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తండ్రి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ముదిరెడ్డి లింగారెడ్డి సంస్మరణ సభ బుధవారం మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో నిర్వహించారు. రాఘవులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి నేతలంతా అపర భగీరథులమని చెప్పుకుంటారని కానీ సాగు, తాగు నీటికోసం ఎన్నో పోరాటాలు చేసి, ఎక్కడ ప్రాజెక్టు అవసరం, ఎక్కడ వరద కాల్వలు నిర్మిస్తే రైతులకు ఉపయోగం అనే వాటిని గుర్తించి వాటి నిర్మాణం కోసం పనిచేసింది కమ్యూనిస్టులేని అన్నారు. అలాంటి వారే అపర భగీరథులని చెప్పారు. తెలంగాణలో నాడు అమలు జరిగిన పట్వారీ వ్యవస్థ, రజాకార్ల పాలనను అంతం కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు గొప్పవని, ఆ పోరాటంలో కేంద్రం బిందువుగా నిలిచిన గొప్ప వ్యక్తుల్లో లింగారెడ్డి ఒకరని కొనియాడారు. కుటుంబాన్ని కూడా సమాజం కోసం అంకితం చేసిన నికార్సైన కమ్యూనిస్టు అని, ఒక కుమారుడు ఆదర్శ రైతు, మరో కుమారుడు ఎర్రజెండా నీడలో పేదల కోసం జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు.యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో నేటికీ తీవ్ర వెట్టిచాకిరీ కొనసాగుతోందన్నారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని వివరించారు. సోషలిస్టు దేశాల్లో విద్య, వైద్యం, పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. ఇండియాలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల మన వాళ్లంతా అమెరికాకు వెళ్లి రెండో తరగతి పౌరులుగా చూడబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇక్కడ ఉద్యోగాలుంటే ఆ పరిస్థితి ఉండదన్నారు. సోషలిస్టు దేశాల్లో ఆ పరిస్థితి లేదని చెప్పడానికి కరోనా కష్టకాలంలో అక్కడ జరిగిన నష్టాన్ని, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. 1946 ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లింగారెడ్డి తన పాత్రను పోషించారన్నారు. వెట్టిచాకిరి తీవ్రంగా ఉండి.. కనీసం పేదలకు తిండి కూడా దొరికేది కాదన్నారు. అందుకే నాడు భూమి కోసం, భుక్తికోసం సాయుధ పోరు నిర్వహించారని చెప్పారు. కమ్యూనిస్టుల పాలన ఉన్నచోట చదువు, ఉద్యోగాలు చేసే వారి సంఖ్య బాగా ఉందని, దానికి ఎర్రజెండా చైతన్యమే కారణమని అన్నారు. ప్రభుత్వ రంగం పటిష్టంగా ఉంటే ప్రజలకు అత్యంత గొప్పగా మేలు జరుగుతుందన్నారు. కరోనా కాలంలో ప్రయివేటు ఆస్పత్రులను మూసుకుంటే.. ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే ప్రజలకు సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య, సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, మాజీ మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కృష్ణారెడ్డి, సయ్యద్ హాషం, ఎండి. సలీం పాల్గొన్నారు.
ఎన్నికల తర్వాతే ఫ్రంట్ నిర్ణయం సరైంది: బీవీ.రాఘవులు
ఎన్నికల తర్వాతనే ఫ్రంట్‌పై నిర్ణయం తీసుకోవడం సరైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా ఇందుగులలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేయడానికి ఇది సరైన సమయం కాదని, ఎన్నికల తర్వాత ఆ ప్రయత్నం చేయాలని సూచన చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో కూడా విబేధాలున్నాయని, దాంతో ఇబ్బంది వస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో కార్పొరేట్ వ్యవస్థ బాగా పెరిగిపోయిందని, పూర్తిగా ఉపాధి కరువైందని తెలిపారు. సామాన్యులు బతకలేని పరిస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థకు అండగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించడం వల్లే పేదలకు కష్టాలు తప్పడం లేదన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కార్పొరేట్ వ్యవసాయ విధానం తెచ్చి డ్రోన్ కెమెరాల ద్వారా నూతన వ్యవసాయాన్ని చేపట్టాలని చూస్తుందన్నారు. తక్షణమే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో రూ.60వేల కోట్ల ఎరువుల రాయితీలను తగ్గించడం చాలా దుర్మార్గమన్నారు. మరోపక్క కాపు కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ కూడా తగ్గించి ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య, నల్లగొండ పట్టణ కార్యదర్శి ఎండి.సలీం, రేమడాల పరశురాములు, రోడి శ్రీనువాస్ తదితరులు ఉన్నారు.