Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల, మతాల కొట్లాటలతో దేశానికి ప్రమాదం
- మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ జాతికి అంకితం
- ఈ కల్లోల క్యాన్సర్‌ను ఎక్కడికక్కడ నలిపేయాలే.. : సీఎం కేసీఆర్
నవతెలంగాణ-సిద్దిపేట, తొగుట
దేశంలో కుల, మత కల్లోలాలు సృష్టిస్తూ సర్వనాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశ రాజకీయాల్లోకి వెళుతున్నాననీ, ఆరునూరైనా ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు తన చివరి రక్తం బొట్టు దారపోసైనా సెట్‌రైట్ చేస్తానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మత కల్లోలాలతో దేశం సర్వనాశనం అయిపోతుందనీ, పెట్టుబడులు రాకుండా పోతున్నాయనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ సమీపంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 'దేశంలో దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోందనీ, అసహ్యం పుట్టే పనులు జరుగుతున్నాయని విమర్శించారు. పిల్లలు కర్నాటక వెళ్లి చదువుకోవాలంటే భయపడుతున్నారనీ, ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలని తెలిపారు. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారిందనీ, మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ నుంచి లక్షా 50 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. శంషాబాద్‌లో ప్రతిరోజూ అంతర్జాతీయ విమానాలు 580 వరకు ల్యాండ్ అవుతున్నాయన్నారు. తెలంగాణలో ఎక్కడ పోయినా ఎకరా భూమి 20 లక్షలకు పైగానే ఉంటుందనీ, మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయనీ, ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోందన్నారు. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రాలు బాగు పడాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలని స్పష్టంచేశారు. మతకల్లోలాలు దేశానికి ప్రమాదకరమనీ, దాన్ని సహించకూడదన్నారు. ఆ క్యాన్సర్‌ను విసర్తించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు చేటు చేసే వారిని నిలదీసి ఎదుర్కోవాలని, క్షమించి ఊరుకోవద్దు అని తెలిపారు.
సస్యశ్యామల తెలంగాణ..
సస్యశ్యామల తెలంగాణ కోసం మరో ముందడుగు పడిందన్నారు. మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగస్వామ్యమయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా 58 వేల మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఓ దుర్మార్గుడు స్టే తెచ్చాడని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌నూ ఆపడానికి 600 పై చిలుకు కేసులు వేశారని చెప్పారు. స్వయంగా తానే హైకోర్టు జడ్జీతో మాట్లాడి ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించడంతో స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు మురళీధర్‌రావు, హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని వారికి సెల్యూట్ తెలిపారు. మంత్రి హరీశ్‌రావు యంగ్ డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. గోదావరి జలాలతో కొమురవెళ్లి మల్లన్న పాదాలకు జలాభిషేకం చేస్తానన్న మాట నిజమైందన్నారు. మధ్య మానేరు ప్రాజెక్ట్ నుంచి నీరు నింపే క్రమంలో సీపెజ్ రావడం సహజమని, కానీ కొందరు జ్ఞానం లేని వ్యక్తులు దాన్ని సైతం దుష్ప్రచారం చేశారని విమర్శించారు. కొండపొచమ్మ సాగర్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని.. వాటిని గుర్తించి ఇంజనీర్లు సవరించాలని, సదరు కాంట్రాక్టర్‌తోనే పని చేయించాలని చెప్పారు. అలాగే, 70 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టూ త్వరలోనే పూర్తి కానున్నదన్నారు. దేశం మొత్తం కరువున్నా.. తెలంగాణకు కరువు రాదన్నారు. ఏప్రిల్ నెలలోనూ చెరువుల్లో నీళ్లు తొణికిసలాడుతాయని తెలిపారు.
నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది
ఈ సందర్భంగా నిర్వాసితుల త్యాగాన్ని సీఎం కొనియాడారు. భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, అసమానమైనదని తెలిపారు. ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనీ, అప్పర్ మానేరు నిర్మాణంలో తన ఇళ్లు కూడా మునిగిందనీ, నిర్వాసితుల బాధ ఎలా ఉంటుందో తనకూ తెలుసని అన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ పరిహారం అందని వారుంటే.. వారిని పిలిపించి సంతృప్తి పరచాలని మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ హనుమంతరావులకు సూచించారు.
గోదావరి జలాలతో మల్లన్నకు సీఎం అభిషేకం
మల్లన్న సాగర్‌ను ప్రారంభించిన అనంతరం ఆ నీటితో కొమురవెల్లి మల్లికార్జున స్వామికి సీఎం కేసీఆర్ అభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం తీసుకొచ్చిన ఐదు కళశాల నీటితో స్వామి వారికి అభిషేకం జరిపించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.