Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై ఇంచార్జీ డీజీపీ
- ఉన్నతస్థాయి సమావేశంలో అంజనీ కుమార్ స్పష్టీకరణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేవారు ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని రాష్ట్ర ఇంచార్జీ డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఆయన బుధవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకున్న మతపరమైన ఉద్రిక్తత పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయనీ, అనేక అభివృధ్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితులకు విఘాతం కలిగించే రీతిలో ఎవ్వరు కూడా చట్టాన్ని అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో శాంతి విచ్ఛిత్తికి యత్నించే వ్యక్తులు, గ్రూపులపై హిస్టరీ షీట్లను, కమ్యూనల్ రౌడీ షీట్లను తెరవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మతపరమైన వ్యవహారాలు సాగిస్తూ ఉద్రిక్తతలను సృష్టించే శక్తుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా వేసి ఉంచాలని ఆయన ఇంటెలిజెన్స్ అధికారులను కోరారు.
కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి నిందితులపై ఐదు కేసులను నమోదు చేయడంతో పాటు పలువురు దుండగులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ కుమార్, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, ఉత్తర మండలం అదనపు డీజీ వై. నాగిరెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ రాజేశ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.