Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్యప్రాణి మండలి ఆమోదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అభయారణ్యాల్లో రహదారుల నిర్మాణాలు, వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా అండర్ పాస్‌ల ఏర్పాటుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్య ప్రాణి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వన్యప్రాణి బోర్డు గతంలో తీసుకున్న నిర్ణయాలను పీసీసీఎఫ్ ఆర్ శోభ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మండలి సభ్యులకు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే రహదారుల నిర్మాణం, అండర్‌పాస్‌ల ఏర్పాటు ఆమోదం ముద్ర వేసినట్టు తెలిపారు. రహదారుల నిర్మాణం, మరమ్మత్తులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభయారణ్యాల్లో వన్యప్రాణుల ప్రమాదాల బారినపడకుండా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి, వేగ నియంత్రణ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వన్య ప్రాణుల దాహాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, శాంతికుమారి, (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం, డొబ్రియల్, బోర్డు సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే కోనప్ప, రాఘవ, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.