Authorization
Fri March 28, 2025 07:46:12 pm
- దుండగులను అరెస్ట్ చేయాలి : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హిందూ వాహిని ముసుగులో మత వైషమ్యాలు సృష్టించి దళితులపై దాడులు చేస్తున్న దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భజరంగ్ దళ్ ముసుగులో సంగారెడ్డి జిల్లా సదాశివమండలం పొట్టిపల్లిలోని దళితులపై దాడి చేసిన పెత్తందారుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 11న పెత్తందారులు ఆ గ్రామంలో హిందూ వాహిని భజరంగ్ దళ్ ప్రోద్బలంతో దళితులపై దాడులకు ఒడిగట్టారని తెలిపారు. చర్చిపై కాషాయం జెండా ఫోన్ స్టేటస్ పెట్టారనీ, దాన్ని తొలగించాలని అడిగితే ఉపసర్పంచ్ మరికొందరు కలిసి అర్ధరాత్రి దళితవాడపై దాడికి దిగారని తెలిపారు. పథకం ప్రకారం కర్రలు, స్టీల్ రాడ్లతో దళిత యువకులు,వృద్దులపై హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఎనిమిది మంది దళితులను తలలు పగలగొట్టి చేతులు విరగగొట్టారని పేర్కొన్నారు. కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేయడమే గాకుండా ఘటనను హిందూ క్రైస్తవ పంచాయతీగా మారుస్తూ ఘర్షణలు సృష్టిస్తున్నారని వివరించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ దాడులను ఉపేక్షిస్తూ దళితులకు చట్టబదంగా న్యాయం చేయడం లేదని విమర్శించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంటనే జోక్యం చేసుకుని గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు. పొట్టిపల్లి దళితులపై దాడి జరిగి 15 రోజులైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల దళితులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతుందని తెలిపారు.