Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ సమావేశాల్లో సర్కారు వైఫల్యాలను ప్రస్తావిస్తాం
- ఏప్రిల్ ఒకటి నుంచి కార్యకర్తలకు బీమా అమలు : టీపీసీసీ చీఫ్ రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకు కోసం శనివారం నుంచి మన ఊరు-మన పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది.శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సర్కారు వైఫల్యాలను ప్రస్తావించనున్నట్టు పేర్కొంది. పరిగి, వేములవాడ, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పార్టీ డిజిటల్ సభ్యత్వం తీసుకున్న వారికి ఏప్రిల్ ఒకటి నుంచి ప్రమాద బీమా అమలవుతుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. సభ్యత్వ రుసుం, బీమా రుసుం వెంటనే చెల్లించాలని కోరారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మెంబర్షిప్ నమోదు కార్యక్రమంలో చురుకైనపాత్ర పోషించి విజయవంతం చేశారని కార్యకర్తలను అభినందించారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఏప్రిల్ ఒకటి నుంచి ప్రమాద బీమా అమలవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, దోపిడీపై ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాలని కోరారు. వివిధ సమస్యలపై కోర్టు పరిశీలనలో ఉన్న కేసులను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నదని విమర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను దెబ్బతీసేలా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. నైనికోల్ మైన్ విషయంలో జరుగుతున్న అవినీతిపై బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై రూ 50వేల కోట్లు దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారనీ, దీనిపై కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు.
నిరుద్యోగ సమస్యపై 27న దీక్షలు :శివసేనారెడ్డి
నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 27న ఇందిరాపార్కు వద్ద దీక్ష నిర్వహిస్తామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి వెల్లడించారు. నిరుద్యోగులందరూ ఈ దీక్షలో పాల్గొలని విజ్ఞప్తి చేశారు. బిశ్వాల్ కమిటీ 2018లోనే లక్ష 91వేల ఉద్యోగ ఖాళీలున్నాయని నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు.