Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటికి హద్దులను నిర్ణయించాలి
- రేపు, ఎల్లుండి నదులపై జాతీయ సదస్సు
- రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో నదుల హక్కులను రక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్ అన్నారు. నదులకు హద్దులను నిర్ణయించాల్సిన అవసరమూ ఉందని వ్యాఖ్యానించారు. ఆయా అంశాలపై చర్చించేందుకు శుక్ర, శనివారాల్లో నదులపై జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు. జాతీయ సదస్సుకు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి తప్ప అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా నదులపై అవగాహన, అధ్యయనం కలిగిన 200 మందికిపైగా నిపుణులు వస్తున్నట్టు చెప్పారు. అర్థవంతమైన చర్చకు అవకాశం ఉందన్నారు. గత చరిత్రలో ఎన్నడూలేనివిధంగా హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలాగే నదుల మేనిఫెస్టోను కూడా రూపొందించనున్నట్టు చెప్పారు. నదులను ఎలా కాపాడుకోవాలి ? నీరు ఎంత పవిత్రమైనదనే విషయాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయనీ, దీనిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. గంగానదీ సర్వనాశనమైందనీ, వందలు, వేల కోట్లు ఖర్చుపెట్టినా ఫలితం రావడం లేదన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ పర్యవేక్షణలో నదులపై జాతీయ సదస్సు జరగనుందన్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించినట్టు చెప్పారు. అలాగే మంత్రులు టి.హరీశ్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్ తదితరులు హాజరుకానున్నట్టు చెప్పారు. రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదుల గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. మానవళి మంచికే ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు వివరించారు. నదులను కాలుష్యంతోపాటు ఆక్రమణల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. విలేకర్ల సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్లు రమణానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ నదుల సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.