Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై అవగాహన కల్పించాలి
- వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలుండాలి
- సర్కారు బడులకు మహర్దశ
- 'మన ఊరు మనబడి' పనుల్లో రాజీలేదు
- ప్రభుత్వం నిర్దేశించిన కాలవ్యవధిలోగా పూర్తి చేయాలి
- అధికారులకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో)ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కోరారు. 70 శాతం సిలబస్‌తో పరీక్షల నిర్వహణ, పరీక్షా సమయం, ప్రశ్నాపత్రంలో ఛాయిస్‌లు పెంచడం, ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలను పెంచడం వంటి అంశాలపై పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఈవోలు, వివిధ శాఖల ఇంజినీర్లతో గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత విద్యాసంవత్సరంలో కరోనా కారణంగా పలు అవాంతరాలు ఏర్పడ్డాయనీ, ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని సూచించారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించే దిశలో డీఈవోలు ఏర్పాట్లు చేయాలని కోరారు. విద్యార్థులకు తరచుగా మోడల్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణను విద్యారంగంలో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి అందరం చిత్తశుద్ధితో సహకరించాలని చెప్పారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసి వాటి ఉనికి శాశ్వతమయ్యేలా సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని వివరించారు. దీన్ని తల్లిదండ్రుల ఆశయాలు, ఆకాంక్షలను సాకారం చేసే నిర్ణయంగా భావించాలన్నారు.
రూపురేఖలు మార్చేందుకే 'మన ఊరు-మనబడి'
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే 'మన ఊరు-మనబడి'కార్యక్రమాన్ని చేపట్టామని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దీన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో సర్కారు బడులకు మహర్దశ రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 12 రకాల వసతులతో పాఠశాలలు కళకళలాడనున్నాయని చెప్పారు. పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో చూడచక్కని రంగులతో అల్లంత దూరం నుంచే పాఠశాలలు ఆకట్టుకోబోతున్నాయని అన్నారు. 'అది మా ఊరి సర్కారు బడి అంటూ సగర్వంగా చెప్పుకునేలా రూపురేఖలను మార్చబోతున్నాం'అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకుండా ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరించాలని కోరారు. అంచనాలు రూపొందించే దగ్గర నుంచి పనులను పూర్తి చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పనులను చేపట్టి కాలవ్యవధి పూర్తయ్యేలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ పార్థసారధితోపాటు విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.